హైదరాబాద్: మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందడంపై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. 

ఇటీవల బస్సులో ప్రయాణికులతో జరిగిన వివాదంలో ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక ప్రమాదవశాత్తు బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించామని మంత్రి పొన్నం తెలిపారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడి పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి వస్తుందని ఆశించామని, కానీ ఇలా మృతి చెందడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రవళిక మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో మహిళా కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఆర్టీసీ పూర్తి స్థాయిలో అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..

అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో బాలుడి టికెట్, చిల్లర విషయం వివాదానికి దారి తీసింది. మిట్టగూడెంకు చెందిన ప్రయాణికురాలికి, మహిళా కండక్టర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మిట్టగూడెం వద్ద ప్రయాణికురాలు దిగేందుకు ప్రయత్నించగా, కండక్టర్ ఆమెను అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు బస్సును ముందుకు నడపాలని డ్రైవర్‌కు సూచించారు.

ఈ క్రమంలో ఆ ప్రయాణికురాలు భయంతో తోసివేయడంతో మహిళా కండక్టర్ కదులుతున్న బస్సు వెనుక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి సదరు ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎల్లయ్య వెల్లడించారు.