Telangana Politics BJP Strategy Revanth BRS: హైదరాబాద్ నడిబొడ్డున పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బషీర్‌బాగ్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం, అబిడ్స్ మీదుగా మొజంజాహి మార్కెట్ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేపట్టిన ప్రజాస్వామ్యాన్ని కాపాడండి - అరాచకాన్ని అంతం చేయండి భారీ పాదయాత్ర తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్‌లకు సవాల్ విసురుతూ నిర్వహించిన ఈ యాత్ర.. అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే తెలంగాణ కమలదళ నాయకత్వానికి అత్యంత కీలకమైన రాజకీయ పరీక్షగా మారింది.
ఏకతాటిపైకి వచ్చిన తెలంగాణ బీజేపీ నేతలు
తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య ఐక్యత కొరవడిందనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్న తరుణంలో, అమిత్ షా పర్యటన సందర్భంగా నేతలంతా ఒకే వేదికపై పక్కపక్కనే నడుస్తూ సమైక్యతను చాటడం విశేషం. కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా అమిత్ షా యాత్రను విజయవంతం చేయడం ద్వారా తమ మధ్య ఆధిపత్య పోరాటాలు పక్కనబెట్టామనే స్పష్టమైన సంకేతాన్ని పార్టీ కేడర్‌కు, జాతీయ నాయకత్వానికి పంపగలిగారు. ఈ పాదయాత్ర కేవలం ఒక ప్రతిపక్ష నిరసన కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది తెలంగాణలో బీజేపీ నిర్వహణా సామర్థ్యాన్ని , క్షేత్రస్థాయి కేడర్ సన్నద్ధతను స్వయంగా అంచనా వేయడానికి అమిత్ షా జరిపిన ఒక పొలిటికల్ టెస్ట్ డ్రైవ్ లా పనిచేసింది. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వంటి జాతీయ ప్రచార అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి క్షేత్రస్థాయిలో ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయో పరిశీలించడానికి ఈ ప్రజా సమూహం ఒక కొలమానంగా మారింది.
అమిత్ షా నెక్ట్స్ స్టెప్ ఏంటి?
పాదయాత్ర పొడవునా పాతబస్తీ, అబిడ్స్ వీధుల్లో కిక్కిరిసిన కార్యకర్తలు, సాధించిన జన సమీకరణ అమిత్ షా వ్యూహకర్తలకు సానుకూల ఫలితాలనే అందించాయి. స్థానిక సమస్యలు, రాష్ట్రంలో ఉనికిలో ఉన్న రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ వ్యతిరేకతను తమవైపు తిప్పుకోవడంలో రాష్ట్ర నాయకత్వ సమన్వయం పనిచేస్తోందని ఈ ఈవెంట్ రుజువు చేసింది. నాయకుల మధ్య అంతర్గత వైరుధ్యాలను తొలగించి, ఎన్నికల యంత్రాంగంలా పనిచేయించేందుకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, రాష్ట్ర నేతలు తీసుకున్న ముందస్తు చర్యలు పక్కాగా పనిచేసాయని ఈ యాత్ర నిరూపించింది. ఈ టెస్టింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో జాతీయ నాయకత్వం తదుపరి కార్యాచరణను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.
మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు
హైదరాబాద్ పర్యటన ఇచ్చిన జోష్‌తో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనసభ రేసు నాటికి తెలంగాణలో కమలాన్ని ఏకైక ప్రత్యామ్నాయ శక్త్యగా నిలబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు మరిన్ని వ్యూహాత్మక అడుగులు వేయబోతున్నారు. భాగ్యనగర వీధుల్లో అమిత్ షా నిర్వహించిన పాదయాత్ర తెలంగాణ బిజెపికి ఊపిరి పోయడమే కాకుండా, నాయకుల ఐక్యతకు పదును పెట్టింది. అధిష్ఠానం పెట్టిన పొలిటికల్ టెస్ట్ డ్రైవ్ లో తెలంగాణ బిజెపి నాయకత్వం విజయం సాధించడమే కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరింత దూకుడుగా రాజకీయం చేసేందుకు దారి సుగమం చేసుకుంది.

