Pithapuram Municipal Election Results : ఏపీలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో విజయ దుందుబి మోగించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన పార్టీ దుమ్మురేపింది. ఆ పార్టీకి చెందిన చైర్మన్ అభ్యర్థి లాజర్ బాబు భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
పిఠాపురం పురపాలికలో 36 వార్డులకుగాను 32,654 ఓటర్లతో పోలింగ్ జరగ్గా.. జనసేన అభ్యర్థికి 20,052 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థికి 10,817, బీఎస్పీ అభ్యర్థికి 26 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 215, నోటాకు 321 ఓట్లు పోలవ్వగా.. 94 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీంతో కూటమి తరపున చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జనసేన పార్టీ నేత లాజర్ బాబు 9,235 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో పిఠాపురం మున్సిపాలిటీపై జనసేన జెండా ఎగిరింది.
పిఠాపురం పురపాలికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ 36 వార్డుల్లో కేవలం ఒక్క వార్డులోనే వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం 16 వార్డుల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించగా.. అంతకుముందే మూడు ఏకగ్రీవం అయ్యాయి. టీడీపీ ఐదు వార్డుల్లో, బీజేపీ ఒక వార్డులో, వైసీపీ ఒక వార్డులో, స్వతంత్రులు 10 వార్డుల్లో విజయం సాధించారు.
ఇక్కడ మున్సిపాలిటీలో రెబల్స్ హవా కూడా కొనసాగింది. మున్సిపాలిటీ పీఠం కూటమి ఖాతాలోకి వెళ్లినప్పటికీ.. వార్డుల కేటాయింపులో టికెట్లు దక్కక బరిలోకి దిగిన రెబల్ అభ్యర్థులకు ఓటర్ల ఆదరణ లభించింది. మొత్తం 10 వార్డుల్లో స్వతంత్రులు ఘన విజయం సాధించి అధికార, ప్రతిప పార్టీలకు షాక్ ఇచ్చారు. టీడీపీ రెబల్స్ నాలుగు వార్డుల్లో (8,9,33,36) విజయం సాధించగా.. జనసేన రెబల్స్ నాలుగు వార్డుల్లో (17,21, 31, 34) విజయం సాధించారు. 1,18 వార్డుల్లో వైసీపీ రెబల్ అభ్యర్థులు విజయం సాధించి కౌన్సిలర్లుగా ఎనికయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరే మున్సిపాలిటీలో లేని విధంగా, కేవలం పిఠాపురంలోనే ఇంత పెద్ద సంఖ్యలో స్వతంత్రులు నెగ్గడం స్థానికంగా సంచలనంగా మారింది చైర్మన్ గా పవన్ కల్యాణ్ బలపర్చిన దానం లాజర్ బాబుకు భారీ ఆధిక్యం కట్టబెట్టిన ప్రజలు.. వార్డు స్థాయికి వచ్చే సరికి పది వార్డుల్లో రెబల్ నేతలకే పట్టంకట్టడం గమనార్హం.

