Pulivendula : నిన్నటి వరకు కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. కానీ, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ఆ పేరు తుడిచిపెట్టుకుపోయింది. కడప జిల్లాల్లో కూటమి పార్టీల అభ్యర్థుల హవా కొనసాగింది. జిల్లాలోని కడప కార్పొరేషన్‌లో మేయర్‌గా కూటమి పార్టీ తరపున బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి మట్లి సువర్ణ ఘన విజయం సాధించారు. తద్వారా కడప నగరపాలక సంస్థ చరిత్రను తిరగరాశారు. ఇక కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లోనూ కూటమి అభ్యర్థులు చైర్మన్లుగా విజయం సాధించారు.

Also Read : AP Municipal Election Results : పిఠాపురంలో ఊహించని ఫలితాలు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రెబల్స్.. వైసీపీ ఒక్కచోట మాత్రమే..

కడప కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా కూటమి అభ్యర్థులు 52 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. మిగిలిన 12 స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 10 చోట్ల విజయకేతనం ఎగురవేయగా.. వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి సువర్ణకు 1,31,615 ఓట్లు పోలవగా.. వైసీపీ అభ్యర్థి బండి దీప్తికి 66,027 ఓట్లు దక్కాయి. దీంతో సువర్ణ 65,588 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డుల్లో ముందుగానే 20 వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన స్థానాల్లో హోరాహోరీ పోరు సాగింది. పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్నీ కూటమి దక్కించుకుంది. 13,875 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గీతాకుమారి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలను చిత్తు చేస్తూ ఆమె గెలుపొందారు.

మొత్తం 40 వార్డుల్లో 34చోట్ల టీడీపీ, 2 చోట్ల బీజేపీ, 3 చోట్ల వైసీపీ, 1 చోట జనసేన అభ్యర్థులు గెలుపొందారు. కాగా, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కూటమి శ్రేణులు స్థానికంగా పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. పులివెందులలోని 14వ వార్డు ఫలితం ప్రత్యేకంగా నిలిచింది. వైఎస్ కుటుంబం నివసించే ఈ స్థానాన్ని టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఒకప్పుడు వైసీపీ కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ టీడీపీ పాగావేయడం పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితిపై చర్చనీయాంశంగా మారింది.