ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా శుభవార్త అందించింది. ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు Foundation for Excellence (FFE) భాగస్వామ్యంతో ‘Amazon Future Engineer Scholarship 2026-27’ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు కాలంలో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అంతేకాకుండా ల్యాప్‌టాప్, సాంకేతిక శిక్షణ, మెంటార్‌షిప్, ఇంటర్న్‌షిప్ అవకాశాలు కూడా కల్పించనున్నారు. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.50,000 చొప్పున నాలుగేళ్లపాటు స్కాలర్‌షిప్ అందిస్తారు. ఇలా మొత్తం రూ.2 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. వీటితో పాటు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ అందిస్తారు. అమెజాన్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో మెంటార్‌షిప్, టెక్నికల్ బూట్‌క్యాంప్స్, వెబినార్లు, నైపుణ్యాభివృద్ధి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. రెండో సంవత్సరం పూర్తయిన తర్వాత అర్హులైన విద్యార్థులకు అమెజాన్‌లో ఎనిమిది వారాల పాటు వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ అవకాశం కూడా కల్పించనున్నారు.

అర్హతలు ఏమిటి?

  • భారతదేశంలోని గుర్తింపు పొందిన కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత విభాగాల్లో చదువుతున్న వారికి అవకాశం ఉంటుంది.
  • మెరిట్ ఆధారిత ప్రవేశ పరీక్షలు లేదా కౌన్సెలింగ్ ద్వారా సీటు పొంది ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉండాలి.
  • మంచి విద్యా ప్రతిభ కలిగి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
  • మహిళా ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.

అవసరమైన పత్రాలు

  • దరఖాస్తు చేసుకునే సమయంలో కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల వివరాలు
  • ప్రవేశ పరీక్ష ర్యాంక్ కార్డు
  • కళాశాల అడ్మిషన్ వివరాలు
  • కళాశాల ఫీజు రసీదు
  • కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
  • ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • ముందుగా Foundation for Excellence అధికారిక వెబ్‌సైట్ను సందర్శించాలి.
  • Amazon Future Engineer Scholarship 2026-27 దరఖాస్తు లింక్‌ను ఎంచుకోవాలి.
  • అవసరమైన వ్యక్తిగత, విద్యా వివరాలను నమోదు చేయాలి.
  • సూచించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • వివరాలను పరిశీలించి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ

Amazon Future Engineer Scholarship 2026-27కు అర్హులైన విద్యార్థులు నవంబర్ 30, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్ చదువుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.