అమరావతి: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు జిల్లాల్లో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఉద్రిక్తతలకు అవకాశం ఉండటంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ (YSRCP) ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులను తమ నివాసాలకే పరిమితం చేస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఎన్నికల పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే ఈ ముందస్తు అరెస్టులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. వీరితో పాటు జిల్లాలోని పలువురు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులను పోలీసులు బైండోవర్ చేయడంతో పాటు, మరికొందరిని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యలతో పల్నాడు ప్రాంతంలో రాజకీయం మరింత వేడెక్కింది. 

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఏజెంట్లను టీడీపీ నేతల ఆదేశాలతో నిన్న అర్ధరాత్రే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ ఇన్‌ఛార్జ్ విజయానందరెడ్డి, మేయర్ అభ్యర్థి చంద్రశేఖర్ నిరసన తెలిపారు. పోలీసులు టీడీపీ నేతలతో కలిసి పనిచేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారని ఆరోపించారు.

విజయవాడలో గుర్తులన్నీ తారుమారు.. బయటపడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం నగరపాలక సంస్థ 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు పక్కన హస్తం గుర్తు కేటాయింపు కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు. ఆర్వోకి ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం. పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తూ ఆర్వో గతంలో విడుదల చేసిన ఫారం-11లో సక్రమంగానే ఉన్న గుర్తులు. ఓటమి భయంతో టీడీపీ నేతలే ఉద్దేశపూర్వకంగా మార్పించినట్లు అనుమానాలు. #APLocalBodyElections #TDPGoons #CBNTurnedAPIntoBihar #SadistChandraBabu

— YSR Congress Party (@YSRCParty) November 1, 2026

విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ గుర్తులు తారుమారు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఓల్డ్ రాజరాజేశ్వరి పేట 55వ డివిజన్‌ బ్యాలెట్ పేపర్‌లో గుర్తులు తారుమారు కావడంతో ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ఎదుట హస్తం గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట ఫ్యాన్ గుర్తు ముద్రించినట్లు గుర్తించారు. దీనిపై వైసీపీ అభ్యర్థి ఫిర్యాదు చేయడంతో రిటర్నింగ్ ఆఫీసర్ చక్రవర్తి పోలింగ్‌ను నిలిపివేశారు. కొత్త బ్యాలెట్ పేపర్లు ముద్రించిన తర్వాత పోలింగ్ పునఃప్రారంభించనున్నారు. ఈ పొరపాటు వల్ల పోలింగ్ దాదాపు రెండు గంటలు ఆలస్యమయ్యే అవకాశముంది.

సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరగనున్న 92 పట్టణ స్థానిక సంస్థల (ULB) ఎన్నికలకలకు పోలింగ్ జరుగుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, నామినేషన్ల సమయంలో హింస నమోదైన సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు.  ఈ ఎన్నికల్లోనూ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) పార్టీలు కలిసి బరిలోకి దిగుతుండగా.. వైసీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు సైతం తమ అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి. 

మొత్తం 100 పురపాలక సంఘాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 8 పురపాలికలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 13 నగరపాలక సంస్థలు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటర్లు ఎలాంటి భయందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా పక్కా భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.