ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ మానవ జీవన విధానాన్ని మార్చే రెండు టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది.  చూపు లేనివారికి చూపు తెప్పించే  ‘బ్లైండ్‌సైట్’ ఒకటైతే,  ఆలోచనల ద్వారా కంప్యూటర్లను నియంత్రించి ఇతరులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించే ‘టెలిపతి’ మరొకటి.

అంధులకు చూపు తెప్పించే బ్లైండ్‌సైట్

న్యూరాలింక్ బ్లైండ్‌సైట్‌ టెక్నాలజీలో కళ్లతో సంబంధం లేకుండా ప్రత్యేక కెమెరా నేరుగా మెదడులో అమర్చిన చిప్ కు దృశ్య సమాచారాన్ని చేరవేస్తుంది.  ఆ చిప్ మెదడులో చూపుకు సంబంధించిన భాగాన్ని (Visual Cortex) ప్రత్యేక ఎలక్ట్రికల్ సంకేతాలతో ఉత్తేజితం చేస్తుంది. తద్వారా వ్యక్తి దృశ్యాలను గుర్తిస్తాడు. కళ్లు చేసే పనిని కెమెరా, మెదడుకు సమాచారాన్ని చేరవేసే పనిని న్యూరాలింక్ చిప్ చేస్తాయి. పుట్టుకతో చూపు లేని వారు కూడా చూడగలిగే అవకాశం ఉంది.

ఆలోచనలతోనే కంప్యూటర్‌ను నియంత్రించే టెలిపతి

న్యూరాలింక్ అభివృద్ధి చేస్తున్న మరో కీలక టెక్నాలజీ టెలిపతి.  మెదడులో అమర్చే ప్రత్యేక చిప్ లేదా ఇంప్లాంట్ లో ఎలక్ట్రోడ్లు ఉంటాయి. అవి మెదడులోని నాడీ సంకేతాలను గుర్తించి డిజిటల్ కమాండ్లుగా మారుస్తాయి. దీంతో కంప్యూటర్‌ మౌస్,  కర్సర్‌ను కదపడం, క్లిక్ చేయడం, టైప్ చేయడం వంటి పనులను ఆలోచనలతోనే చేయవచ్చు.

పక్షవాతం కారణంగా చేతులు, కాళ్లు కదపలేని వారికి, మాట్లాడటంలో ఇబ్బందులు ఉన్న వారికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇప్పటికే పక్షవాతంతో బాధపడుతున్న కొందరిపై ‘టెలిపతి’ ప్రయోగాలు నిర్వహించారు. తమ ఆలోచనలతో కంప్యూటర్ కర్సర్‌ను నియంత్రించడం, గేమ్స్ ఆడటం, సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం చేయగలిగారు.

మాటల వేగాన్ని మించిపోతుందా?

టెలిపతి టెక్నాలజీ భవిష్యత్తులో కమ్యూనికేషన్ విధానాన్నే మార్చేస్తుందని ఎలాన్ మస్క్ ధీమా వ్యక్తం చేసారు.  ఆలోచించడం ద్వారా కంప్యూటర్ తో వేగంగా సమాచారాన్ని పంచుకోవచ్చనీ,  సమాచారాన్ని పంపే వేగం మనిషి మాట్లాడే వేగాన్ని, టైప్ చేసే వేగాన్ని మించిపోనుందనీ చెప్పారు.

న్యూరాలింక్ అభివృద్ధి చేస్తున్న బ్లైండ్‌సైట్ ఇంకా టెలిపతి టెక్నాలజీలు వైద్య రంగంతో పాటు మానవ కమ్యూనికేషన్‌లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈ ప్రయోగాత్మక టెక్నాలజీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా పరిశోధనలు, క్లినికల్ పరీక్షలు, నియంత్రణ సంస్థల అనుమతులు అవసరం.