ENE Repeat Movie Review: ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా అప్పటి కుర్రకారుకు ఒక ఎమోషన్. స్నేహం, సరదా, సహజమైన సంభాషణలతో దర్శకుడు తరుణ్ భాస్కర్ సృష్టించిన ఆ మ్యాజిక్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పుడు సరిగ్గా ఎనిమిదేళ్ల విరామం తర్వాత అదే గ్యాంగ్ మళ్లీ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE Repeat) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కార్తీక్ పాత్రలో సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో శ్రీనాథ్ మాగంటి కనిపించారు. శివాత్మిక రాజశేఖర్, శ్రీరామ్ చంద్ర, అనీషా ఆంబ్రోస్ కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఎస్ ఒరిజినల్స్, రూట్‌నాడ్ సినిమాస్ బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ సీక్వెల్ నేడు (నవంబర్ 19) థియేటర్లలో విడుదలైంది. మరి తొలి భాగంలోని మ్యాజిక్‌ను ఈ సినిమా మళ్లీ రిపీట్ చేసిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

ఈ నగరానికి ఏమైంది రిపీట్ కథేంటంటే..

ఒక సినిమా చేసి ఫెయిల్యూర్ రావడంతో ఎవరి దారి వారిది అన్నట్టుగా విడిపోయిన నలుగురు మిత్రులు వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్ గోమటం), ఉప్పి (వెంకటేష్ కాకుమాను), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి) ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కలుస్తారు. ఇందుకు కారణం పెళ్లి బాజాలు. అంకిత్ (శ్రీరామ్ చంద్ర), ఉప్పి చెల్లి కీర్తన(శివాత్మిక) బ్యాచిలర్ పార్టీ కోసం ఈ గ్యాంగ్ అంతా మళ్లీ ఒక్కటవుతుంది. అయితే, ఆ పార్టీ రాత్రి పబ్‌లో జరిగిన ఒక పెద్ద గొడవ వల్ల పెళ్లి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో సవాళ్లు ఎదురవ్వడంతో, తాము ఎప్పుడో వదిలేసిన ‘సినిమా’ కలను మళ్లీ పట్టాలెక్కించాలని ఈ నలుగురు డిసైడ్ అవుతారు. ఈసారి ఒక సర్వైవల్ థ్రిల్లర్ తీయాలనే ప్లాన్‌తో థాయిలాండ్ ఫ్లైట్ ఎక్కుతారు. ఆ తర్వాత వీరి ప్రయాణం ఎలా సాగింది? సినిమా తీసే క్రమంలో వీరికి ఎదురైన తిప్పలేంటి? కీర్తన (శివాత్మిక), కార్తీక్‌ల ప్రేమకథ ఏ తీరానికి చేరింది? చివరికి వీళ్లు అనుకున్నట్టుగా హిట్ కొట్టారా లేదా? అన్నదే మిగతా కథ.

సినిమా విశ్లేషణ:

2018లో వచ్చిన ఫస్ట్ పార్ట్ లాగే ఈ సినిమాలో కూడా బలమైన కథ కంటే, సీన్స్ మధ్య పండే ఆర్గానిక్ కామెడీ మీదే దర్శకుడు ఎక్కువగా ఆధారపడ్డారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా, కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ, ఎప్పుడైతే నలుగురు మిత్రులు మళ్లీ కలుస్తారో అక్కడి నుంచి అసలు సందడి మొదలవుతుంది. ముఖ్యంగా పబ్ ఎపిసోడ్, అందులో వచ్చే సంభాషణలు కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్లు మంచి వినోదాన్ని పంచుతాయి. సెకండాఫ్‌లో కథ థాయిలాండ్‌కు షిఫ్ట్ అయిన తర్వాత కామెడీ మరో స్థాయికి వెళ్తుంది. ఫ్లైట్ సీన్లు, రాబిన్(మహేష్ ) పాత్రతో పండించిన కామెడీ నవ్వులు పూయిస్తాయి. అయితే, సెకండ్ హాఫ్ మధ్యలో కథనం కాస్త సాగదీసినట్టుగా, కొన్ని సన్నివేశాలు రిపీట్ అయినట్టుగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల డైలాగ్స్ మరీ వేగంగా వెళ్లడం వల్ల స్పష్టత లోపించింది, మరికొన్ని చోట్ల కామెడీ బలవంతంగా ఇరికించినట్టు కొందరికి అనిపించినా Gen Z, ముఖ్యంగా సోషల్ మీడియా బ్యాచ్ కి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సెకండ్ హాఫ్ చివరి వరకు కూడా ఎవరికి వారు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు అనే అనుమానం కలిగించేలా చేసిన దర్శకుడు చివరిలో మాత్రం సినిమాని ఎమోషనల్ గా స్నేహితులందరూ ముఖ్యంగా సినిమాని ప్రేమించే వాళ్ళందరూ శభాష్ అనిపించేలా సినిమా ముగించాడు. సింపుల్‌గా, హృదయానికి హత్తుకునేలా రాసుకున్న క్లైమాక్స్, అందులో వచ్చే ఇతర దర్శకుల సర్‌ప్రైజ్ ఎంట్రీలు సినిమాను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లాయి.

నటీనటుల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటుల సహజమైన నటన. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ మరోసారి తన ఎనర్జీతో అదరగొట్టారు. ఈ మధ్య కాలంలో విశ్వక్ నుంచి వచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అని చెప్పొచ్చు. ఇక సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది మాత్రం అభినవ్ గోమటం. తన మార్క్ డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించారు అక్కడక్కడా ఆయన నటనలో బ్రహ్మానందం ఛాయలు కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు. ఉప్పి పాత్రలో వెంకటేష్ కాకుమాను తన అమాయకత్వం, టైమింగ్‌తో మెప్పించారు. సాయి సుశాంత్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసిన శ్రీనాథ్ మాగంటి, కార్తీక్ పాత్రకు తన వంతు న్యాయం చేశారు. అయినప్పటికీ, పాత కార్తీక్‌ను చూసిన ప్రేక్షకులకు సుశాంత్ లోటు అక్కడక్కడా కనిపిస్తుంది. శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్, శ్రీరామ్ చంద్ర తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి తన ట్రెండీ డైలాగ్స్, మెటా కామెడీతో యూత్ పల్స్ పట్టుకునే ప్రయత్నం చేశారు. సినిమా తీయడం వెనుక ఉండే కష్టాలను సరదాగా చూపిస్తూనే, తనదైన మార్క్ సన్నివేశాలను రాసుకున్నారు. అయితే, స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి, కథనంలో వేగం పెంచి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఈ సినిమాకు మరో హీరో. పాటలతో పాటు, తన నేపథ్య సంగీతంతో సాధారణ సన్నివేశాలను కూడా ఎలివేట్ చేశారు. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ చాలా సహజంగా, థాయిలాండ్ లొకేషన్లను అందంగా చూపించింది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకండాఫ్‌లో మరికొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.

ఫైనల్లీ: ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ స్ట్రెస్ బస్టర్ ముఖ్యంగా యూత్, జెన్-జీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.