YSRCP Strategy Against YS Sharmila Backfires: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ భేటీపై వైసీపీ అనుకూల మీడియా సంస్థ , ఆ పార్టీ సోషల్ మీడియా విభాగాలు ప్రచురించిన కథనాలు కొత్త వివాదానికి తెరలేపాయి. చంద్రబాబుతో షర్మిల చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని, ఒకవైపు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే మరోవైపు సీఎంతో సన్నిహితంగా ఉంటూ ద్వంద్వ రాజకీయ వైఖరి అవలంబిస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. అయితే, ఒక కుటుంబ శుభకార్యానికి సంబంధించిన మర్యాదపూర్వక ఆహ్వానాన్ని రాజకీయం చేయడంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో, ఈ వ్యవహారం వైసీపీకే ఎదురుదెబ్బగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ప్రముఖ నేతలందర్నీ పిలుస్తున్న షర్మిల
వాస్తవానికి, తమ ఇంట్లో జరిగే వేడుకకు పార్టీలకు అతీతంగా ప్రముఖులను ఆహ్వానించే సంప్రదాయాన్ని వైఎస్ షర్మిల అనుసరిస్తున్నారు. తన కుమార్తె అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహానికి రావాలని కోరుతూ ఆమె ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తమిళనాడు నేత విజయ్, అలాగే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఇదే క్రమంలో, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ వ్యక్తిగత స్నేహితుడైన చంద్రబాబు నాయుడుని సైతం ఆమె మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. గతంలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ సమయంలోనూ షర్మిల ఇదే తరహాలో చంద్రబాబును ఆహ్వానించారు.
చంద్రబాబును వ్యక్తిగత శత్రువుగానే చూసే జగన్
ఇక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్ షర్మిల అనుసరించే రాజకీయ శైలి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని భావిస్తున్నారు. వైఎస్ జగన్ తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడును పూర్తిస్థాయి రాజకీయ శత్రువుగా చూస్తూ, కనీసం మర్యాదపూర్వక పలకరింపులకు కూడా దూరంగా ఉంటారు. కానీ, షర్మిల మాత్రం రాజకీయ విమర్శలను కేవలం ప్రజా సమస్యలు, విధానాల వరకే పరిమితం చేస్తూ, వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ వేడుకల విషయంలో హుందాగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ షర్మిల కట్టుకున్న పసుపు చీర పై వైసీపీ నేతలు చేసిన విమర్శలు అప్పట్లో విమర్శల పాలయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒక ఆడబిడ్డ పెళ్లి శుభలేఖ అందించడాన్ని కూడా రాజకీయ కోణంలో వక్రీకరించడం పట్ల సామాన్య ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ మీడియా కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల, నేరుగా తన సోదరుడు వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని ఘాటుగా స్పందించారు. ఇంట్లో ఆడబిడ్డ పెళ్లికి పెద్దలను పిలవడం మన సంస్కృతి.. దాన్ని కూడా నీచ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు అంటూ ఆమె మండిపడ్డారు. పైగా, వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా తాను ఆహ్వానించానని, మరి ఆయనతో కూడా తాను కుమ్మక్కయినట్లేనా అని ఆమె ప్రశ్నించడం వైసీపీ నేతలను ఇరకాటంలో పడేసింది.
గతంలో షర్మిల విమర్శించారని వైసీపీ వాదన
మరోవైపు, వైసీపీ వర్గాలు మాత్రం తమ వాదనను సమర్థించుకుంటున్నాయి. గతంలో చంద్రబాబును కుట్రల బాబు అని తీవ్రంగా విమర్శించిన షర్మిల, ఇప్పుడు ఆయన నివాసానికి వెళ్లి నవ్వుతూ ఫోటోలకు పోజులివ్వడం కాంగ్రెస్–టీడీపీ మధ్య ఉన్న అంతర్గత అవగాహనకు నిదర్శనమని సాక్షి కథనాలు, వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాదిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని దెబ్బతీయడానికే షర్మిల ఇలాంటి సంకేతాలు పంపుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. షర్మిలను రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో వైసీపీ వ్యూహకర్తలు సున్నితమైన కుటుంబ విషయాలను లాగడం ద్వారా గీత దాటుతున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, శుభకార్యాలకు ఒకరినొకరు ఆహ్వానించుకోవడం తెలుగు సమాజంలో ఎంతో గౌరవప్రదమైన సంప్రదాయం. అలాంటి సందర్భాన్ని రాజకీయ దాడికి వాడుకోవడం వల్ల షర్మిల ఇమేజ్ దెబ్బతినకపోగా, అనవసరపు విమర్శలతో వైసీపీకే రాజకీయంగా నష్టం వాటిల్లుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

