AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3,949 సర్పంచ్ స్థానాలు, 39,832 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పరిశీలన అనంతరం 21,393 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు, 87,318 వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక, మొదటి దశలో తిరుపతి జిల్లా అత్యధిక స్థానాలతో ముందంజలో ఉంది. జిల్లాలోని 16 మండలాల్లో 404 సర్పంచ్ స్థానాలకు, 3,684 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అత్యధికంగా 2,267 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక అత్యధిక వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్లు అనకాపల్లి జిల్లాలో చెల్లుబాటయ్యాయి. ఈ జిల్లాలో 6,515 వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదం పొందాయి.

మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. రెండో దశలో రాష్ట్రంలోని 27 జిల్లాల పరిధిలో 52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల్లోని మొత్తం 4,975 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ నామినేషన్ల స్వీకరణ మొదటి రోజున సర్పంచ్ స్థానాలకు రాష్ట్రవ్యాప్తంగా 3,504 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు 7,329 నామినేషన్లు వచ్చాయి. రెండో దశలో విశాఖపట్నం జిల్లాలోని ఏ గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం లేదు. సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 366 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 845 నామినేషన్లు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రెండు దశల్లోనూ ఉత్సాహంగా కొనసాగుతోంది.