హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక ఊరటనిచ్చింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. తాజా నిర్ణయం ప్రకారం విద్యార్థులు నవంబర్ 26వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. వాస్తవానికి పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గతంలో ప్రకటించిన గడువు నవంబర్ 16తో ముగిసింది. అయితే ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు గడువును పాఠశాల విద్యాశాఖ అధికారులు మరోసారి పొడిగించారు. దీంతో విద్యార్థులు నవంబర్ 26 వరకు తమ పరీక్ష ఫీజును చెల్లించవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలి. పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ఫీజు చెల్లించాలని, మరిన్ని వివరాల కోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు.

