పట్టుదల, కృషి ఉంటే విజయం తప్పక సాధ్యమని నిరూపించారు తమిళనాడుకు చెందిన ముగ్గురు సోదరులు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురూ ఒకే ఏడాది వైద్య విద్య కోర్సుల్లో సీట్లు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. చేనేత కార్మికుడి కుమారులైన ఈ ముగ్గురు సోదరులు నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందడం విశేషం. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వెళ్లాంగుళికి చెందిన రామకుమార్ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. ఆయనకు వెంకట్శ్రీ, అరుణ్, ధరణ్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో అరుణ్, ధరణ్ కవలలు. ముగ్గురూ వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో నీట్ పరీక్షకు సిద్ధమయ్యారు. పెద్ద కుమారుడు వెంకట్శ్రీ గతంలో మూడుసార్లు నీట్ పరీక్ష రాసినా ఆశించిన ఫలితం దక్కలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా పట్టుదలతో మరోసారి ప్రయత్నించారు. ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలో 440 మార్కులు సాధించి నాగర్కోవిల్ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో బీడీఎస్ సీటు పొందారు.
ఇక కవలలైన అరుణ్, ధరణ్ కూడా ఈ ఏడాది నీట్ పరీక్ష రాశారు. అరుణ్ 511 మార్కులు సాధించి తిరునెల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నారు. ధరణ్ 494 మార్కులతో కోయంబత్తూరులోని పీఎస్జీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశం పొందారు. ఈ ముగ్గురు సోదరులకు వైద్య విద్యలో సీట్లు లభించడంలో తమిళనాడు ప్రభుత్వం కల్పిస్తున్న 7.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఈ రిజర్వేషన్ ద్వారా వైద్య విద్యలో ప్రవేశాలకు అవకాశం లభించింది.
కష్టపడి పనిచేసే తండ్రి, పట్టుదలతో చదువుకున్న ముగ్గురు కుమారులు.. ఇప్పుడు ఒకే ఏడాది వైద్య విద్యలో ప్రవేశాలు సాధించి కుటుంబానికి గర్వకారణంగా నిలిచారు. ఆర్థిక పరిస్థితులు, వరుస వైఫల్యాలు లక్ష్యానికి అడ్డంకులు కావని ఈ సోదరుల విజయం చాటిచెబుతోంది. ముగ్గురు సోదరులు ఒకేసారి వైద్య విద్యలో అడుగుపెట్టడం స్థానికంగా ఆనందాన్ని నింపడంతోపాటు ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

