ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. గుండె వేగం ఎంత ఉంది? ఎన్ని అడుగులు నడిచాం? ఎంతసేపు నిద్రపోయాం? రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉంది? ఇలా అనేక ఆరోగ్య వివరాలను స్మార్ట్‌వాచ్‌లు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాయి. దీంతో చాలామంది తమ ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు వస్తున్నారు. అయితే స్మార్ట్‌వాచ్‌లో హార్ట్‌బీట్ సాధారణంగా కనిపిస్తే స్ట్రోక్ వచ్చే ప్రమాదం లేదని భావించడం పొరపాటేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. స్ట్రోక్ లక్షణాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో చికిత్స పొందేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా స్మార్ట్‌వాచ్‌లు స్ట్రోక్‌ను గుర్తించగలవా? అనే అంశంపై వైద్యులు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు.

స్మార్ట్‌వాచ్ సాధారణంగా చూపించినా స్ట్రోక్ రావచ్చా?

గురుగ్రామ్‌లోని సీకే బిర్లా ఆసుపత్రి న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మోహిత్ ఆనంద్ ప్రకారం.. స్మార్ట్‌వాచ్‌లను పూర్తి స్థాయి వైద్య పరీక్షా పరికరాలుగా భావించకూడదు. ఇవి గుండె వేగం, గుండె లయ వంటి కొన్ని అంశాలను మాత్రమే పర్యవేక్షిస్తాయి. కొన్ని పరికరాలు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (AFib) వంటి అసాధారణ గుండె లయలను గుర్తించే సూచనలు ఇవ్వగలవు. ఈ సమస్య స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

అయితే స్ట్రోక్ అనేది కేవలం గుండె వేగానికి సంబంధించిన సమస్య కాదు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళంలో రక్తం గడ్డకట్టడం, రక్తనాళం చిట్లి రక్తస్రావం జరగడం వల్ల స్ట్రోక్ వస్తుంది. కాబట్టి స్మార్ట్‌వాచ్‌లో నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటున్నట్లు కనిపించినా స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమంటున్నారు వైద్య నిపుణులు.

స్ట్రోక్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

స్ట్రోక్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సంకేతాలను గుర్తుంచుకోవాలి:

– ముఖం ఒకవైపు వాలిపోవడం.

– చేయి లేదా కాలులో ఒకవైపు బలహీనత, తిమ్మిరి రావడం.

– మాట తడబడటం లేదా ఇతరులు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం.

– అకస్మాత్తుగా చూపు మందగించడం లేదా దృష్టి కోల్పోవడం.

– నడవడంలో ఇబ్బంది, సమతుల్యత కోల్పోవడం.

– కారణం తెలియని తీవ్రమైన తలనొప్పి.

ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. స్మార్ట్‌వాచ్ సాధారణ రీడింగ్ చూపిస్తోందని ఆసుపత్రికి వెళ్లడం ఆలస్యం చేయకూడదు. లక్షణాలు ప్రారంభమైన సమయాన్ని గుర్తుంచుకోవడం కూడా చికిత్సలో కీలకం. కొన్ని నిమిషాల్లో లక్షణాలు తగ్గిపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. అది తాత్కాలిక ఇస్కీమిక్ దాడి (TIA) లేదా మినీ స్ట్రోక్ కావచ్చు.

స్మార్ట్‌వాచ్ రీడింగ్స్ ఎంతవరకు నమ్మాలి?

స్మార్ట్‌వాచ్‌లోని సెన్సార్లు కదలికలు, పరికరాన్ని సరిగ్గా ధరించకపోవడం, సాంకేతిక పరిమితుల కారణంగా కొన్నిసార్లు తప్పు రీడింగ్స్ ఇవ్వవచ్చు. ECG ఫీచర్ కొన్ని గుండె లయ సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. కానీ అది పూర్తి గుండె పరీక్షకు లేదా మెదడు పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉన్నా మెదడుకు రక్త సరఫరా సక్రమంగా ఉందని నిర్ధారించలేమంటున్నారు వైద్య నిపుణులు.

స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే?

రోజూ వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. ధూమపానానికి దూరంగా ఉండాలి. గుండె లయలో మార్పులు కనిపించినా, స్మార్ట్‌వాచ్ పదేపదే హెచ్చరికలు ఇచ్చినా వైద్యులను సంప్రదించాలి.

గుర్తుంచుకోండి: స్మార్ట్‌వాచ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఉపయోగపడే సాధనం మాత్రమే. స్ట్రోక్‌ను నిర్ధారించే పరికరం కాదు. స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం విలువైనదే. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడమే ప్రాణాలను కాపాడే కీలక చర్య. ఈ కథనం అవగాహన కోసం మాత్రమే. స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..