బరువు తగ్గాలని, సన్నగా మెరుపుతీగలా మారాలని అనుకుంటున్నారా? అయితే రోజూ క్రమం తప్పకుండా అవిసె గింజల నీళ్లు తాగేందుకు ప్రయత్నించండి. కేవలం బరువు తగ్గడమే కాదు.. ఈ నీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

అవిసె గింజల ధరలు తక్కువగానే ఉంటాయి. వీటిని సూపర్ ఫుడ్స్ గా పిలుచుకుంటారు. అవిసె గింజల నీళ్లను రోజూ తాగడం వల్ల ఎన్నో రోగాలు దూరమవుతాయి. వీటిలో కరిగే, కరగని పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పరిగడుపున ఈ నీటిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగై మలబద్ధకం తగ్గుతుంది, ప్రేగుల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం టైప్ 2 డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు. అధిక బరువు కూడా బ్లడ్ షుగర్ పెరగడానికి దారితీస్తుంది. ఈ అవిసె గింజల నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ నియంత్రణలోకి రావడమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది.

అవిసె గింజలలోని మ్యూసిలేజ్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల బాడీకి పదే పదే ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ డ్రింక్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె జబ్బులు, స్ట్రోక్ రాకుండా కాపాడతాయి. అవిసె గింజల్లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు టైప్ 2 డయాబెటిస్, పక్షవాతం ముప్పును తగ్గిస్తుంది.

కనీసం 12 వారాల పాటు ఈ నీటిని తాగితే రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తాయి. ఇది రక్తంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను కూడా పెంచుతుంది.

అవిసె గింజల్లోని అధిక పీచు పదార్థం కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రతి 10 గ్రాముల ఫైబర్ పెరిగితే ఈ క్యాన్సర్ ముప్పు 7 శాతానికి తగ్గుతుంది. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది.

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిలోని ఫైబర్ శరీరంలో క్రొవ్వు చేరకుండా చూస్తూ, అతిగా తినే అలవాటును నియంత్రిస్తుంది.

రోజుకు 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను ఒక కప్పు (250 ml) నీళ్లలో నానబెట్టి మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అతిగా తీసుకుంటే ఇబ్బందులు రావచ్చు.