Litchi Capital: మార్కెట్లో లిచ్చీ పండ్లను చూడగానే నోరూరుతుంది. అయితే దేశంలో పండే అన్ని లిచ్చీల రుచి ఒకేలా ఉండదు. కానీ మనదేశంలోని ఓ నగరంలో పండే లిచ్చీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని లిచ్చీ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు?
బీహార్‌లోని ముజఫర్‌పూర్ నగరాన్ని 'లిచ్చీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్'గా పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం అక్కడ పండే షాహీ లిచ్చీ. ఈ ప్రాంతంలో లిచ్చీ సాగు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ముజఫర్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ విస్తారంగా లిచ్చీ తోటలు కనిపిస్తాయి. భారతదేశంలో లిచ్చీ ఉత్పత్తిలో బీహార్ ప్రముఖ రాష్ట్రంగా ఉంది. అందులోనూ ముజఫర్‌పూర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పండే షాహీ లిచ్చీ రుచి, సువాసన ఆకట్టుకుంటాయి. ఈ పండ్లకు ఉన్న డిమాండ్ కారణంగా వేసవి వచ్చిందంటే ఈ ప్రాంతంలోని తోటలు, మార్కెట్లు సందడిగా మారిపోతాయి.
సాధారణ లిచ్చీలతో పోలిస్తే షాహీ లిచ్చీకి ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. పండు పండినప్పుడు పై తొక్క ఎరుపు, గులాబీ రంగుల్లో కనిపిస్తుంది. లోపల ఉండే గుజ్జు లేత కొబ్బరిలా, తియ్యటి రుచితో ఉంటుంది ఈ లిచ్చీకి 2018లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) గుర్తింపు లభించింది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పండే ఉత్పత్తికి, ఆ ప్రాంతంతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తిస్తూ ఈ ట్యాగ్ ఇస్తారు. దీంతో షాహీ లిచ్చీకి ముజఫర్‌పూర్ ప్రాంతంతో ఉన్న గుర్తింపు మరింత బలపడింది.
ముజఫర్‌పూర్‌లో లిచ్చీ సాగుకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పడానికి అక్కడ ఉన్న జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రం కూడా ఒక ఉదాహరణ. ఇక్కడ ICAR-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ లిచ్చీ పనిచేస్తోంది. లిచ్చీ సాగులో కొత్త పద్ధతులు, అధిక దిగుబడి, పండ్ల నాణ్యత, పంటకు వచ్చే తెగుళ్ల నివారణ వంటి అంశాలపై ఈ కేంద్రం పరిశోధనలు చేస్తోంది. పంట కోత తర్వాత పండ్లు పాడవకుండా నిల్వ చేయడం, రవాణా సమయంలో నాణ్యత దెబ్బతినకుండా చూడటం వంటి అంశాలపైనా దృష్టి పెడుతోంది.
ముజఫర్‌పూర్, పరిసర ప్రాంతాల్లోని అనేక రైతు కుటుంబాలకు లిచ్చీ సాగు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. వేసవి ప్రారంభంలో పంట చేతికొచ్చే సమయంలో తోటల్లో సందడి నెలకొంటుంది. పండ్లను కోయడం, వేరు చేయడం, ప్యాకింగ్ చేయడం, మార్కెట్లకు తరలించడం వంటి పనులతో స్థానికంగా ఉపాధి కూడా లభిస్తుంది. లిచ్చీ పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కోసిన తర్వాత త్వరగా వాటి తాజాదనం తగ్గుతుంది. అందుకే సరైన సమయంలో పంట కోయడం, వేగంగా మార్కెట్లకు తరలించడం రైతులకు చాలా ముఖ్యం. ముజఫర్‌పూర్‌లో పండే షాహీ లిచ్చీ వేసవి సీజన్లో బీహార్ మార్కెట్లకే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకూ చేరుతుంది. GI గుర్తింపు రావడంతో ఈ పండుకు ఉన్న ప్రాంతీయ ప్రత్యేకతకు మరింత ప్రాచుర్యం లభించింది.

