న్యూఢిల్లీ: క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న లక్షలాది మంది రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం అందించింది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) వివిధ ప్రముఖ ఫార్మా బ్రాండ్లకు చెందిన ఏకంగా 543 రకాల క్యాన్సర్ నిరోధక మందుల (Anti-Cancer Drugs) గరిష్ఠ విక్రయ ధరలను (MRP) భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన ఈ కొత్త ధరలు నవంబరు 9, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 27 వరకు ఫార్మా కంపెనీలు సమర్పించిన సమాచారం ఆధారంగా ఎన్‌పీపీఏ ఈ సవరించిన ధరల జాబితాను విడుదల చేసింది. షెడ్యూల్‌లో చేర్చని మిగిలిన క్యాన్సర్ మందుల ధరలను తయారీదారులు సవరించినప్పుడల్లా ఈ జాబితాను నిరంతరం నవీకరిస్తామని స్పష్టం చేసింది. ప్రముఖ కంపెనీల మందులన్నీ సామాన్యులకూ తక్కువ ధరకే లభించనున్నాయి.

తగ్గించిన ధరల ప్రకారం..

ఫుల్‌బ్రెకా (5 మి.లీ. వయల్‌): ఆర్‌పీజీ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన ఈ మందు పాత ధర రూ. 26,072.16 కాగా, సవరించిన కొత్త ధర రూ. 5,491 కు చేరింది.

డెబ్రుమాబ్‌ (60 మి.గ్రా. సిరంజి): ఆర్‌పీజీ లైఫ్‌ సైన్సెస్‌ ఉత్పత్తి ధర రూ. 22,031.25 నుంచి రూ. 5,941కు పడిపోయింది.

బెవాసిజాబ్‌ (4 మి.లీ. వయల్‌): అబాట్‌ హెల్త్‌కేర్‌కు చెందిన ఈ ప్రాణరక్షక మందు ధర రూ. 21,767.70 నుంచి ఏకంగా రూ. 5,930.10 కు తగ్గింది.

ఫ్లూడానాక్స్‌ (వయల్‌): హెటెరో హెల్త్‌కేర్‌ ఉత్పత్తి ధర రూ. 14,235.00 నుంచి రూ. 2,432 కి భారీగా తగ్గింది.

ఎనుటా (28 క్యాప్సూల్స్): ఆర్‌పీజీ లైఫ్‌ సైన్సెస్‌ బ్రాండ్ ధర రూ. 6,578.20 నుంచి రూ. 2,232 కు అందుబాటులోకి వచ్చింది.

అజాసిటిన్‌ (ఒక ప్యాక్): డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్ ఉత్పత్తి ధర రూ. 6,337.00 నుంచి రూ. 1,495 కి దిగివచ్చింది.

డసానాట్‌ 20 (60 మాత్రలు): నాట్కో ఫార్మా ఉత్పత్తి చేస్తున్న ఈ టాబ్లెట్ల ప్యాక్ ధర రూ. 2,812.50 నుంచి రూ. 1,085.90 కు తగ్గనుంది.

ఆర్థిక స్థోమత లేక వైద్యానికి దూరమవుతున్న సగటు పేద మరియు మధ్యతరగతి రోగులకు ఈ ధరల తగ్గింపు ప్రాణదానంతో సమానమని రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. నవంబరు 9 నాటికి దేశంలోని అన్ని ఫార్మసీలు, హాస్పిటళ్లు తగ్గిన ఎంఆర్‌పీల ప్రకారమే విక్రయాలు జరపాలని, ధరల ఉల్లంఘనలపై కఠిన చర్యలు ఉంటాయని ఎన్‌పీపీఏ స్పష్టం చేసింది.