Samsung W27 Launched: శాంసంగ్ (Samsung) చైనా టెలికాం భాగస్వామ్యంతో తన కొత్త లగ్జరీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Samsung W27ను అధికారికంగా విడుదల చేసింది. ‘Heart to the World’ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్‌ను బిజినెస్, ప్రీమియం వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఇది గాలక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైంది. ప్రత్యేకమైన శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్ ఈ ఫోన్‌కు మరో ప్రత్యేకత.

భారీ ఫోల్డబుల్ డిస్‌ప్లే

ఈ కొత్త Samsung W27లో 8 అంగుళాల QXGA+ Dynamic AMOLED 2X ప్రధాన ఫోల్డింగ్ డిస్‌ప్లేను అందించారు. 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. HDR10+ సపోర్ట్‌తో పాటు 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఫోన్ బయట భాగంలో 6.5 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X కవర్ డిస్‌ప్లే ఉంది. ఇంకా 1Hz-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 3 రక్షణను అందించారు.

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్

మొబైల్ పెర్ఫార్మెన్స్ కోసం ప్రత్యేకంగా గాలక్సీ కోసం రూపొందించిన 3nm Snapdragon 8 Elite Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. దీనికి Adreno 840 GPU కూడా అందించారు. ఫోన్ 16GB RAMతో వస్తుంది. స్టోరేజ్ విషయంలో 512GB, 1TB వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే Android 17 ఆధారిత One UI 9తో ఈ ఫోన్ పనిచేస్తుంది. శాంసంగ్ గాలక్సీ AI ఫీచర్లలో భాగంగా ఇన్స్టంట్ సెర్చ్, లైవ్ ట్రాన్సలేషన్ వంటి స్మార్ట్ టూల్స్ అందించారు. భద్రత కోసం Samsung Knox ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు.

200MP ట్రిపుల్ కెమెరా

ఫొటోగ్రఫీ కోసం Samsung W27లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో OIS, Quad Pixel AFతో కూడిన 200MP ప్రధాన కెమెరా, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, OIS, PDAFతో కూడిన 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్, 30x స్పేస్ జూమ్ కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లోని లోపలి, బయటి డిస్‌ప్లేలపై 10MP ఫ్రంట్ కెమెరాలను అందించారు. కెమెరా వ్యవస్థ 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్

Samsung W27లో 5000mAh బ్యాటరీని మాత్రమే అందించారు. దీనికి 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోల్డబుల్ ఫోన్ అయినప్పటికీ రోజువారీ వినియోగానికి సరిపడే బ్యాటరీ సామర్థ్యాన్ని ఇందులో పొందవచ్చని కంపెనీ చెబుతోంది.

ప్రీమియం డిజైన్ & శాటిలైట్ కమ్యూనికేషన్

బిజినెస్, లగ్జరీ సెగ్మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని W27ను ప్రీమియం డిజైన్‌తో రూపొందించారు. రెడ్, బ్లూ వంటి రంగుల్లో లభించే ఈ ఫోన్‌లో ఫ్రేమ్, హింజ్, కెమెరా హౌసింగ్, లెన్స్ రింగ్స్‌కు గోల్డ్ ఫినిష్ ఇచ్చారు. వెనుక భాగంలో ‘Heart to the World’ ప్రత్యేక లోగోను ముద్రించారు. ఫోన్ వెనుక ప్యానెల్, కవర్ డిస్‌ప్లేకు Corning Gorilla Glass Ceramic 3 రక్షణ ఉంది. నీటి నుంచి రక్షణ కోసం IP48 రేటింగ్ అందించారు. ఇంకా ఇందులో Tiantong శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు సపోర్ట్ అందించారు. సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకున్న వినియోగదారులకు ఒక సంవత్సరం డైరెక్ట్ శాటిలైట్ నెట్‌వర్క్ యాక్సెస్, 300 నిమిషాల శాటిలైట్ వాయిస్ కాల్స్, 100 శాటిలైట్ టెక్స్ట్ మెసేజ్‌లు లభిస్తాయి.

ధర

చైనాలో 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 18,999 యువాన్లు (USD 2,850 / సుమారు రూ.2,71,455)గా ఉంది. అదే 16GB RAM + 1TB టాప్ వేరియంట్ ధర 21,999 యువాన్లు (USD 3,300 / సుమారు రూ.3,14,250)గా నిర్ణయించారు. రిజర్వేషన్ సమయంలో నమోదు చేసుకునే కస్టమర్లకు 1,399 యువాన్ల విలువైన శాంసంగ్ కేర్+ ప్రీమియం సర్వీస్ ప్యాకేజీని అందిస్తున్నారు. ఇందులో డిస్‌ప్లే రీప్లేస్‌మెంట్‌పై డిస్కౌంట్, డైరెక్ట్ రీప్లేస్‌మెంట్ సర్వీస్, బ్యాటరీ రీప్లేస్‌మెంట్, ఉచిత స్క్రీన్ ప్రొటెక్టర్ అప్లికేషన్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.