CM Chandrababu Teleconference Cyclone Arnab 2026: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసిన అర్నబ్ తుఫాన్ దాటికి ప్రభావితమైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు అధికార యంత్రాంగం విశ్రమించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అమరావతి వేదికగా వివిధ శాఖల ఉన్నతాధికారులు, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆయన నిర్వహించిన ఉన్నత స్థాయి టెలీకాన్ఫరెన్స్‌లో తుఫాన్ తదనంతర పరిస్థితులు, సహాయక చర్యలు మరియు పునరుద్ధరణ పనులపై సమగ్రంగా సమీక్షించారు. విపత్తు వేళ యంత్రాంగం అద్భుతంగా పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించగలిగిందని అభినందిస్తూనే, మిగిలిన పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఒకవైపు రాయలసీమలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం, మరోవైపు ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లో అర్నబ్ తుఫాన్ బీభత్సం వంటి విభిన్నమైన వాతావరణ సవాళ్లు నెలకొన్నాయని సీఎం గుర్తు చేశారు. రాయలసీమలో పంటలు వేయలేని దుస్థితి ఉంటే, తీరప్రాంత జిల్లాల్లో వేసుకున్న పంటలు, కొబ్బరి తోటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు విభిన్న రకాల విపత్తుల నుంచి ప్రజలను బయటపడేయడానికి అధికారులు పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని, బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
సహాయక చర్యల వేగం పెంచాలని ఆదేశించిన చంద్రబాబు, పంట నష్టం మినహా బాధితులందరికీ తక్షణ నష్టపరిహారం పంపిణీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే పరిహారానికి సంబంధించిన జీవో జారీ అయినందున, ఏ ఒక్క అర్హుడూ నష్టపోకుండా వేగంగా ఆర్థిక భరోసా అందించాలని సూచించారు. రోడ్లపై పడిపోయిన చెట్లను, పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని, నిలిచిపోయిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను 24 గంటల్లోగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
వరదల్లో మునిగిన పంటలను కాపాడేందుకు సాంకేతికతను, శాస్త్రీయ విధానాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. నీటమునిగిన పంటలను ఏ మేరకు కాపాడవచ్చో అధ్యయనం చేయడానికి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు సంయుక్తంగా రంగానికి దిగాలని పిలుపునిచ్చారు. పడిపోయిన కొబ్బరి చెట్లు, ఉద్యాన పంటల మొక్కలను రీ-ప్లాంటేషన్ చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. పంట నష్టాన్ని వేగంగా, పారదర్శకంగా అంచనా వేయడానికి అత్యాధునిక డ్రోన్ , శాటిలైట్ టెక్నాలజీని వినియోగించాలని ఆదేశించారు.
విపత్తు నిర్వహణలో పారదర్శకత అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పునరుద్ధరణ పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం ద్వారా వారి నుంచి పూర్తి సహకారం లభిస్తుందని తెలిపారు. తుఫాన్ బాధిత వ్యవసాయ, ఉద్యాన రైతులకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వివిధ ప్రభుత్వ పథకాలను సమగ్రంగా వర్తింపజేస్తామని, బాధితుల ముఖాల్లో చిరునవ్వు చూసేంత వరకు యంత్రాంగం క్షేత్రస్థాయిలోనే ఉండి పని చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

