YS Jagan YS Sharmila Bangalore House Controversy: తెలుగు రాష్ట్రాల రాజకీయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదాలు ఇప్పుడు చౌరస్తాకు వచ్చాయి. వైఎస్ కుటుంబంలో ఇప్పటికే సరస్వతి పవర్ షేర్లతో పాటు పలు ఆస్తుల వ్యవహారాలు ఎన్‌సిఎల్‌టి కోర్టు మెట్లు ఎక్కగా, తాజాగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వివాదం సరికొత్త రాజకీయ దుమారాన్ని రేపుతోంది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఈ శత్రుత్వంలో.. వైఎస్సార్ కూతురు షర్మిల తన కుమార్తె అంజలి వివాహ వేడుకను యలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలని భావించడం, దానికి జగన్ భద్రతా కారణాలు చెబుతూ అనుమతించకపోవడం రాజకీయ వర్గాల్లో విస్తుపోయేలా చేస్తోంది.
అందులోనే షర్మిలకు ఇల్లు
ఈ బెంగళూరు ప్యాలెస్ కేవలం ఒక విలాసవంతమైన భవనం మాత్రమే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కుటుంబం కోసం నిర్మించిన ఆస్తి. గతం నుండి షర్మిల ఇక్కడ సుదీర్ఘకాలం నివాసముండటంతో పాటు, కుటుంబ అవసరాలకు ఇది నిలయంగా మారింది. అందుకే తన కూతురు వివాహ శుభలేఖలలో కూడా షర్మిల వివాహ వేదికగా యలహంక ప్యాలెస్‌ను ముద్రించి ఆహ్వానాలు కూడా పంచారు. అయితే, నా ఇంట్లోకి వివాహ కేటరింగ్, ఈవెంట్ మేనేజర్లు, ఫోటోగ్రాఫర్లు రావడం వల్ల నా భద్రతకు, ప్రైవసీకి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది అంటూ జగన్ లేఖ రాయడం, హైదరాబాద్ లోటస్ పాండ్‌ను వాడుకోవాలని సూచించడంపై షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రి వైఎస్సార్ కట్టించిన ఆస్తిలో తనకూ సమాన హక్కు ఉందని ఆమె వర్గం సెంటిమెంట్ అస్త్రాన్ని బలంగా ప్రయోగిస్తోంది.
షర్మిలకు ప్రజల సానుభూతి
ఈ వివాదంలో సామాజికంగా, రాజకీయంగా లభిస్తున్న ప్రజాభిప్రాయాన్ని గమనిస్తే, సానుభూతి పవనాలు పూర్తిగా షర్మిల వైపే వీస్తున్నాయి. ఎంత రాజకీయం ఉన్నా, కన్న చెల్లెలి కూతురు పెళ్లికి.. అదీ సొంత మేనకోడలి కళ్యాణానికి ప్యాలెస్‌ను తిరస్కరించడం ఏ రకమైన సంస్కృతి అని నెటిజన్లు, ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఏపీలోని ప్రత్యర్థి పార్టీలు ఎన్డీయే, టీడీపీ నేతలు కూడా జగన్ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సొంత చెల్లెలికి, మేనకోడలికి న్యాయం చేయలేని నాయకుడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? అంటూ చంద్రబాబు, నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తుండటం వైఎస్సార్‌సీపీని తీవ్ర ఇరకాటంలో పడేసింది.
జగన్ ఇమేజ్‌కు సమస్యే
ఇక పొలిటికల్ ఇమేజ్ పరంగా చూస్తే జగన్ మోహన్ రెడ్డికి ఈ ఘటన వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. 2024 ఎన్నికల ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్‌సీపీ మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, ఇటువంటి పర్సనల్ ఇష్యూస్ జగన్ ప్రజాదరణను మరింత దిగజారుస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, వైఎస్ విజయమ్మ కూడా షర్మిల పక్షాన నిలబడటంతో.. జగన్ వద్ద పనిచేస్తున్న రాజకీయ సలహాదారులు, కోటరీ ఆయనకు సరైన సలహాలు ఇవ్వడంలో ఘోరంగా విఫలమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంకేతిక, చట్టపరమైన, ప్రైవసీ సాకులు చెప్పి మేనకోడలి పెళ్లిని నిరోధించడం కంటే, పెద్ద మనసుతో వేడుకకు అనుమతిస్తే రాజకీయంగా పాయింట్లు స్కోర్ చేసే అవకాశం ఉండేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ పరిణామాలపై ఆలోచించని జగన్
జగన్ వైఖరి వెనుక ఉన్న పట్టుదల లేదా మంకుపట్టుదల ఆయనను రోజురోజుకూ జనాల్లో ప్రతికూల నాయకుడిగా నిలబెడుతోంది. నేను చెప్పిందే వేదం, నా మాటే శాసనం అనే దోరణి రాజకీయంలోనైనా, కుటుంబంలోనైనా దెబ్బతీస్తుందనేది ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఒకవేళ భద్రతే కారణమైతే పగడ్బందీ సెక్యూరిటీ అరెంజ్‌మెంట్స్ చేసుకుని పెళ్లి జరిపించే అవకాశాలు ఉన్నప్పటికీ.. అంతగా భీష్మించుకుని కూర్చోవడం వల్ల వైఎస్సార్ అభిమానుల్లో సైతం జగన్ పట్ల తీవ్ర నైతిక అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ బెంగళూరు ప్యాలెస్ వివాదం కేవలం ఒక ఇల్లు లేదా కళ్యాణ వేదికకు పరిమితమైన సమస్య కాదు. వైఎస్ కుటుంబంలో ఏర్పడిన ఆస్తులు, రాజకీయ వారసత్వ పోరు క్లైమాక్స్‌కు చేరిందనడానికి ఇది స్పష్టమైన సంకేతం. సలహాదారుల లోపమో లేక సొంత పట్టుదలో కానీ, ఈ వివాదంలో జగన్ తన ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేసుకుంటుంటే.. షర్మిల మాత్రం బాధితురాలిగా ప్రజా సానుభూతిని కూడగట్టుకోవడంలో ముందంజలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆస్తుల రగడ కోర్టుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో, వైఎస్సార్‌సీపీపై ఎలాంటి రాజకీయ ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

