AP Local Body Elections: అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ (TDP) తమ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థులపై కఠిన చర్యలు చేపట్టింది. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి ఎన్నికల బరిలో నిలిచిన రెబల్స్ అందరికీ టీడీపీ క్రమశిక్షణా నోటీసులు జారీ చేసింది. పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థుల గెలుపునకు పూర్తిస్థాయిలో సహకరించాలని, వెంటనే తమ పోటీ నుంచి తప్పుకుని కూటమికి మద్దతు ప్రకటించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వని పక్షంలో పార్టీ నుంచి సస్పెన్షన్ తప్పదని టీడీపీ అధినేత హెచ్చరించారు. ఏపీ స్థానిక ఎన్నికల్లో రెబల్స్ పోటీ చేయడం వల్ల పార్టీ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని రెబల్స్ ను హెచ్చరించింది. గత రెండు రోజులుగా వివిధ జిల్లాల్లో పోటీలో ఉన్న మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థులతో పాటు, డివిజన్లు, వార్డుల నుంచి పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు ఈ నోటీసులను పంపారు.
విశాఖపట్నం పరిధిలోని ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, భీమిలి, గాజువాక ప్రాంతాల్లో పోటీ చేస్తున్న పలువురు రెబల్ అభ్యర్థులకు విడివిడిగానూ నోటీసులు జారీ చేశారు. అనంతపురం జిల్లాలో ప్రతి డివిజన్ వారీగా రెబల్స్ అభ్యర్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా హెచ్చరిక లేఖలు ఇచ్చారు. ఆయా ప్రాంతాల పార్లమెంటు పార్టీ కార్యాలయ అధ్యక్షుల పేరుతో ఈ నోటీసులు జారీ కాగా, కూటమి విజయమే ధ్యేయంగా నాయకులంతా క్రమశిక్షణతో పని చేయాలని అందులో టీడీపీ పిలుపునిచ్చింది.

