అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన పూర్తి అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా నిర్ణయం తీసుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల వివరాలు, ఆస్తులు, నేరచరిత్ర తదితర వివరాలను సులభంగా తెలుసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ హైకోర్టుకు తెలిపారు.

దీనికోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్‌ను రూపొందించి, బరిలో నిలిచిన అభ్యర్థులందరి అఫిడవిట్లను అందులో అప్‌లోడ్ చేస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి అఫిడవిట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని, పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ ఏపీ హైకోర్టుకు స్పష్టం చేశారు.

నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి, మిగిలిన 772 ప్రధాన పదవుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. వివిధ స్థాయిల్లో మొత్తం 4,042 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ లక్ పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థల (కార్పొరేషన్ల) మేయర్ పదవుల కోసం 153 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 922 డివిజన్లలో ఇప్పటికే 118 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 804 డివిజన్లలో 3,073 మంది అభ్యర్థులు పోటీలో కొనసాగుతున్నారు. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. మున్సిపాలిటీలకు సంబంధించి 17 మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలు, 637 కౌన్సిలర్ పదవులు ఏకగ్రీవమయ్యాయని ఎస్ఈసీ పేర్కొంది. మిగిలిన 70 ఛైర్‌పర్సన్ పదవుల కోసం 367 మంది బరిలో నిలవగా, అలాగే 2,382 వార్డు కౌన్సిలర్ స్థానాల కోసం 6,669 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 1న జరగనుండగా, ఓటర్లు తమ సౌకర్యార్థం ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఓటర్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఉనీ పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 36,351 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల్లో మోహరించారని... భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు 34 మంది ఎస్పీలు, 52 మంది అదనపు ఎస్పీలు, 152 మంది డీఎస్పీ రంగంలోకి దిగారు. అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా ఎన్నిల నిర్వహణకు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయిన వెంటనే బ్యాలెట్ బాక్సులను భద్రపరచడానికి రాష్ట్రవ్యాప్తంగా 111 స్ట్రాంగ్‌రూమ్‌లను సిద్ధం చేశారు.