India vs New Zealand: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు, ఇప్పుడు నాలుగో టీ20 కోసం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో బరిలోకి దిగనుంది. అయితే ఈ చిన్న వేదికపై భారత్‌కు అజేయమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ప్రతిసారీ ఛేజింగ్‌లో భాకత్ సత్తా చాటుతూ మన జట్టు ఘనవిజయాలు సాధించింది. ఈ చిన్న మైదానం టీమిండియాకు అచ్చం సొంత మైదానంలా మారిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఆక్లాండ్‌లో భారత్ ఆడిన మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ విజయాల జెండా పాతింది. ఇక్కడ మన జట్టు విజయాల రికార్డు వంద శాతంగా ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌ల వివరాలు పరిశీలిద్దాం..

మొదటి మ్యాచ్ (8 ఫిబ్రవరి 2019): ఈ వేదికపై ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో న్యూజిలాండ్ 158 పరుగులు చేసింది. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన కృనాల్ పాండ్యా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. రోహిత్ శర్మ (50), శిఖర్ ధావన్ (30), మూడో స్థానంలో వచ్చి అజేయంగా 40 పరుగులు చేసిన రిషబ్ పంత్, ధోనీ (20 నాటౌట్) రాణించడంతో భారత్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రెండో మ్యాచ్ (24 జనవరి 2020): ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో, భారత్ 19 ఓవర్లలోనే 204 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ప్రస్తుత జట్టును నాయకత్వం వహిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు ఈ మైదానం ఎంతో ప్రత్యేకమైనది.

మూడో మ్యాచ్ (26 జనవరి 2020): ఇదే వేదికపై జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 132 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 57 పరుగులు చేయగా, శ్రేయస్ అయ్యర్ మరోసారి 33 బంతుల్లో 44 పరుగులు చేసి రాణించారు. దీంతో భారత్ 17.3 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

ఇలా ఆక్లాండ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఛేదన ద్వారానే విజయాలు సాధించింది. ప్రస్తుతం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పటికే 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఆక్లాండ్‌లో తమ అజేయ రికార్డును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు ఈ చిన్న మైదానంలో టీమిండియా రికార్డు కివీస్ జట్టును భయపెడుతోంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా ఆ జట్టు ఓటమి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తుందో లేదో చూడాలి.