Azmatullah Omarzai Creates T20I Record: అఫ్గానిస్థాన్, జింబాబ్వే మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ భారీ మలుపులతో సాగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ కేవలం 5 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 38 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరడంతో అఫ్గానిస్థాన్ 100 పరుగుల్లోపే ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. అఫ్గానిస్థాన్ బ్యాటెర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ విధ్వంసక బ్యాటింగ్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.

నెం.6లో బ్యాటింగ్‌కు వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 50 బంతుల్లో 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా అఫ్గానిస్థాన్ కష్టాల్లో నుంచి బయటపడటమే కాకుండా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో జింబాబ్వే ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఈ శతకంతో అజ్మతుల్లా ఒమర్జాయ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫుల్ మెంబర్ జట్ల తరఫున టీ20ల్లో నెం.6 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ శతకం సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు.. నెం.6 లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఫుల్ మెంబర్ జట్ల ఆటగాళ్లలో అత్యధిక టీ20 స్కోరు చేసిన బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2017లో ఐర్లాండ్‌పై నబీ 89 పరుగులు చేశాడు. ఇప్పుడు 116 పరుగులతో ఒమర్జాయ్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

నెం.6 లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ చేసిన ఫుల్ మెంబర్ జట్ల ఆటగాళ్లలో అత్యధిక స్కోర్ల జాబితాలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 116 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. మహ్మద్ నబీ 89, సామ్ బిల్లింగ్స్ 87, కామెరాన్ వైట్ 85*, డేవిడ్ మిల్లర్ 85* పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే కూడా అఫ్గానిస్థాన్‌కు గట్టి పోటీ ఇచ్చింది. కెప్టెన్ సికందర్ రజా అద్భుత సెంచరీతో జట్టును విజయానికి చేరువ చేశాడు. రజా 56 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. అయితే మరో ఎండ్ నుంచి తగిన సహకారం లభించకపోవడంతో జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అఫ్గానిస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మ్యాచ్‌ను గెలవడంతో పాటు సిరీస్‌ను కూడా అఫ్గానిస్థాన్ తన ఖాతాలో వేసుకుంది.

0/1
1/2
5/3
5/4
38/5

THEN AZMATULLAH OMARZAI SMASHED 116(50) vs ZIMBABWE IN T20I 🤯 One of the greatest innings in shorter format history and helped Afghanistan post 221/7. https://t.co/TLkbgoRpHD

— Johns. (@CricCrazyJohns) October 29, 2026