టాలీవుడ్‌లో ఒకప్పుడు ‘బుట్టబొమ్మ’గా భారీ క్రేజ్ సంపాదించిన పూజా హెగ్డేకు ఇప్పుడు వరుస పరాజయాలు సవాల్‌గా మారాయి. తెలుగులో ‘అల వైకుంఠపురములో’, తమిళంలో ‘బీస్ట్’ సినిమాల తర్వాత ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. బాలీవుడ్‌లోనూ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ‘హౌస్‌ఫుల్ 4’ మినహా ఆమె నటించిన హిందీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ టాలీవుడ్‌లో బుట్టబొమ్మగా వచ్చిన క్రేజ్‌తో కొంతకాలం పాటు అవకాశాలు అందుకుంది. అయితే వరుస ఫ్లాపుల నేపథ్యంలో ఆ క్రేజ్ ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఇటీవల ‘కూలీ’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో సందడి చేసిన పూజా హెగ్డే.. ‘రెట్రో’, ‘జన నాయగన్’ వంటి సినిమాల్లోనూ కనిపించింది. మరోవైపు ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’లో గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ విజయాలు మాత్రం ఆమెకు దూరంగానే ఉంటున్నాయి. వరుస పరాజయాల ప్రభావం పూజా కెరీర్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమాల సంఖ్య కూడా పరిమితమే. తమిళంలో ‘కాంచన 4’, తెలుగులో ‘శ్రీశ్రీ’ సినిమాలు ఆమె లైనప్‌లో ఉన్నాయి. అయితే ఈ చిత్రాల విడుదల తేదీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇక అహాన్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘సంకీ’ సినిమాకు పూజా హెగ్డే 2024లోనే సైన్ చేసింది. ఈ చిత్రం 2025 ప్రేమికుల రోజున విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. అక్టోబర్ 30 నుంచి తిరిగి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూజా ఆశలన్నీ ఈ సినిమాలపైనే ఉన్నాయి. ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫలితాలు సాధిస్తే ఆమెకు మళ్లీ వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో తన పాత క్రేజ్‌ను తిరిగి సంపాదించుకోవాలంటే ఒక బలమైన హిట్ అవసరం. మరి పూజా ఈ సినిమాలతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తుందా?.. తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టుకుంటుందా? అన్నది చూడాలి.