జెరూసలేం: ఇజ్రాయెల్ పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరలేపాయి. అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తికాగా, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్)లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాలకు నెతన్యాహు కూటమి దూరంగా నిలిచింది. దీంతో తదుపరి ప్రభుత్వం ఎవరిదనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
53 స్థానాలకే పరిమితమైన నెతన్యాహు కూటమి
ఎన్నికల తుది ఓట్ల లెక్కింపు ప్రకారం నెతన్యాహు నేతృత్వంలోని కూటమి 53 స్థానాలను గెలుచుకుంది. ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు లభించగా, అరబ్ పార్టీలకు మొత్తం 19 స్థానాలు దక్కాయి. నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని యషార్ పార్టీ 21 స్థానాలు సాధించగా, నఫ్తాలి బెన్నెట్‌కు చెందిన బి’యాచాద్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. జాయింట్ లిస్ట్ 11 స్థానాలు దక్కించుకుంది.
ఇతర పార్టీల విషయానికి వస్తే.. డెమోక్రాట్స్, రా’అమ్ పార్టీలు చెరో 8 స్థానాలు గెలుచుకున్నాయి. యునైటెడ్ తోరా జుడాయిజం, యిస్రాయెల్ బీటెను, ఓట్జ్మా యెహుదిత్ పార్టీలు చెరో 7 స్థానాలు సాధించాయి. షాస్, రిలిజియస్ జియోనిజం పార్టీలు చెరో 6 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ప్రత్యేక బ్యాలెట్లుగా పరిగణించే డబుల్ ఎన్వలప్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈ తుది సీట్ల కేటాయింపులు వెలువడ్డాయి.
విదేశీ జోక్యంపై ఆరోపణలు.. దర్యాప్తు
మరోవైపు ఎన్నికల ఫలితాలపై వివాదం రాజుకుంది. అరబ్ నేతృత్వంలోని పార్టీలు ఓట్ల కొనుగోలు, అక్రమ ఓటర్ల సమీకరణకు పాల్పడ్డాయని నెతన్యాహు పార్టీ లికుడ్ ఆరోపించింది. విదేశీ నిధుల సహాయంతో అరబ్ ఓటర్ల ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేశారనే అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఖతార్, టర్కీ ప్రమేయం ఉందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఖతార్ సైతం తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశీయ భద్రతా సంస్థ షిన్ బెట్ విదేశీ జోక్యానికి సంబంధించిన అనుమానాలపై దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఎన్నికల అక్రమాలపై పోలీసులు కూడా విచారణ చేపట్టారు. అయితే ఎన్నికల సమగ్రతను వ్యవస్థాగతంగా ఉల్లంఘించారనే ఆరోపణలకు ఆధారాలు లేవని కేంద్ర ఎన్నికల కమిటీ స్పష్టం చేసింది.
అరబ్ పార్టీలే కీలకం.. నెక్స్ట్ ఏం జరగనుంది?
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అరబ్ పార్టీలకు లభించిన 19 స్థానాలు అత్యంత కీలకంగా మారాయి. ప్రతిపక్ష కూటమి ఈ పార్టీల మద్దతు లేదా సహకారం పొందగలిగితే 61 స్థానాల మెజారిటీని దాటే అవకాశం ఉంది. అయితే అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షంలోని కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది.
మరోవైపు నెతన్యాహు కూడా తన మిత్రపక్షాలను వదులుకోకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. చర్చలు విఫలమైతే మరోసారి ఎన్నికలు జరిగే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. కాగా, ఎన్నికల లెక్కింపు పూర్తయినప్పటికీ అధికారిక ఫలితాలను నవంబర్ 4న అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌కు సమర్పించనున్నారు. నవంబర్ 10న కొత్త క్నెసెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది. మొత్తంగా ఇజ్రాయెల్ రాజకీయాల్లో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
అక్టోబర్ 30 నాటికి ఎన్నికల కమిటీ ప్రకటించిన తుది సీట్ల కేటాయింపుల ప్రకారం నెతన్యాహు కూటమికి 53, ప్రతిపక్షానికి 48, అరబ్ పార్టీలకు 19 స్థానాలు వచ్చాయి. ఓటింగ్ శాతం 77.9 శాతంగా నమోదైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

