CM Chandrababu to Visit West Godavari Today: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధిత ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో సీఎం సమీక్షించనున్నారు.
సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నరసాపురం ప్రాంతంలోని నవరాసపురం గ్రామానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.20 నుంచి 1.40 గంటల వరకు తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. రైతులతో మాట్లాడి పంట నష్టం, వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు మొగల్తూరు మండలంలోని మత్రేవు గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి.. జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించనున్నారు.
మధ్యాహ్నం 2.45 గంటలకు మత్రేవు సైక్లోన్ షెల్టర్‌కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న తుఫాన్ బాధితులతో మాట్లాడనున్నారు. వారి ఇబ్బందులు, అవసరాలను తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా అనే అంశాలను కూడా పరిశీలించనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.05 నుంచి 3.20 గంటల వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడనున్నారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టం, రైతులకు అందించనున్న సహాయం, బాధితుల పునరావాసం, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై వివరాలు వెల్లడించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.45 గంటలకు మొగల్తూరు హెలిపాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.

