School Holiday Extended in Konaseema: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవులను మరోసారి పొడిగించారు. నేడు కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తుఫాన్‌ కారణంగా మంగళవారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతుండగా.. పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సెలవు పొడిగింపుపై ప్రకటన చేశారు.

అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని పలు పాఠశాలల ప్రాంగణాల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. వాటిని ఇంకా పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలవులు పొడిగించారు. చెట్ల తొలగింపు, పాఠశాల ప్రాంగణాల శుభ్రత పనులు పూర్తికాకపోవడం కూడా ఈ నిర్ణయానికి మరో కారణం. మరోవైపు తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఇంకా పునరుద్ధరణ కాలేదు. దీంతో పాఠశాలల్లో తాగునీటి సరఫరాకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యుత్‌ అందుబాటులో లేకపోవడం, తాగునీటి సమస్యల నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించడం సాధ్యంకాదని అధికారులు భావిస్తున్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేటి సెలవును ప్రకటించారు. తుఫాన్‌ ప్రభావం పూర్తిగా తగ్గి, పాఠశాలల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే తరగతుల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లా అతలాకుతలమైంది. మంగళవారం సాయంత్రం నుంచి జిల్లావ్యాప్తంగా పెను ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురవడంతో.. జనజీవవం పూర్తిగా అస్తవ్యస్తమైంది. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.