Goldstone Miyapur Land Scam Supreme Court Judgment: హైదరాబాద్ లో కోట్లాది రూపాయల విలువైన మియాపూర్ భూముల దావాలో తెలంగాణ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో చారిత్రాత్మక విజయం దక్కింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న దాదాపు 550 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిపై ప్రైవేట్ వ్యక్తులు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓపెన్ మార్కెట్లో వేల కోట్ల విలువైన ఈ భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పిన ధర్మాసనం.. ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో తాము మౌనంగా ఉండలేమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు యంత్రాంగం చూపిన చొరవను ప్రశంసిస్తూ, ఉమ్మడి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
ఈ భూ వివాదం మూలాలు దశాబ్దాల క్రితం నాటి నిజాం జాగీర్దారీ వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. సర్వే నంబర్లు 100, 101లలోని భూములను నిజాం కాలం నాటి జాగీర్దార్ కైసరుద్దీన్ చట్టబద్ధమైన వారసులైన అమీరున్నీసా బేగం తదితరుల నుంచి కొనుగోలు చేశామంటూ గోల్డ్‌స్టోన్ పార్థసారథి, ఆయన సోదరుడు ప్రసాద్, సువిశాల్ జైన్ తదితరులు క్లెయిమ్ చేశారు. ఇర్రివోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పొంది, సనద్ హక్కుల ప్రకారం ఈ భూములు తమవేనంటూ ట్రినిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సువిశాల్ పవర్, గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ సంస్థల పేరిట రికార్డులు సృష్టించే యత్నం చేశారు. అప్పట్లో శేరిలింగంపల్లి తహసీల్దార్ ఈ జీపీఏ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు కోర్టులను ఆశ్రయించగా, 2003లో ఉమ్మడి ఏపీ హైకోర్టు తహసీల్దార్ చర్యను సమర్థిస్తూ ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రైవేట్ వర్గం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది.
సుప్రీంకోర్టులో గత 23 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సుదీర్ఘ కేసుపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు అత్యంత బలమైన ఆధారాలతో వాదనలు వినిపించారు. నిజాం నవాబుల కాలంలోనే జాగీర్దార్ కైసరుద్దీన్కు ప్రభుత్వ పరంగా పరిహారం చెల్లించారని, జాగీర్ల రద్దు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ భూములు పూర్తిగా సర్కారు పరం అయ్యాయని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా పరిహారం తీసుకున్న తర్వాత కూడా నకిలీ డాక్యుమెంట్లు, మోసపూరిత రెవెన్యూ రికార్డులతో వారసులమంటూ క్లెయిమ్ చేయడం చెల్లదని సర్కారు వాదించింది. ఇప్పటికే ఇందులో మెజార్టీ భూమిని హెచ్ఎండీఏ కు అప్పగించామని, మరికొంత భాగాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ డిపో నిర్మాణానికి కేటాయించామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇరుపక్షాల వాదనలను సమగ్రంగా పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. మోసపూరిత రెవెన్యూ రికార్డుల ద్వారా ఎలాంటి యాజమాన్య హక్కులు రావని తేల్చిచెప్పింది. 2003 నాటి ఉమ్మడి హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను పూర్తిగా కొట్టివేసింది. గతంలో 2017లో కూకట్పల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా జరిగిన భారీ మియాపూర్ భూ కుంభకోణం వెనుక కూడా ఇదే నెట్వర్క్ ఉండటం, క్రిమినల్ కేసులు నమోదు కావడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చి తీర్పుతో ఆ కుంభకోణానికి సైతం పూర్తి స్థాయి న్యాయపరమైన పుల్‌స్టాప్ పడింది.
తుది తీర్పుతో ఐటీ కారిడార్‌ను ఆనుకుని ఉన్న 550 ఎకరాల అత్యంత విలువైన భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ, సర్వహక్కులు ఖరారయ్యాయి. దశాబ్దాలుగా సాగుతున్న సుదీర్ఘమైన, సంక్లిష్టమైన న్యాయపోరాటం తర్వాత ప్రజా ఆస్తులు ప్రైవేట్ భూమాఫియా పరం కాకుండా దక్కించుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సాధించిన అతిపెద్ద లీగల్ విజయంగా నిలిచింది. ఈ తీర్పు రాబోయే రోజుల్లో కబ్జాలకు గురవుతున్న ఇతర ప్రభుత్వ భూముల రక్షణకు , న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులకు ఒక కీలకమైన రోల్ మోడల్‌గా నిలవనుంది.

