Konda Surekha BRS Re-entry Speculations:  తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి, వరంగల్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ వేసిన ఒక చిన్న అడుగు  హాట్ టాపిక్ అయింది.   బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో తాను చేసిన తీవ్ర వ్యక్తిగత, నిరాధార వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ఎక్స్  వేదికగా ఆమె సంచలన ప్రకటన చేశారు. నాడు సినీ ప్రముఖులతో ముడిపెట్టి కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్లపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, విచారకరమైన హృదయంతో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. గతంలో  క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు.. కోర్టులోనే తేల్చుకుంటా అని ప్రతినబూనిన సురేఖ, సడన్‌గా ఇలా బేషరతుగా దిగిరావడం వెనుక కేవలం లీగల్ నోటీసుల భయమే కాదు, రాబోయే భారీ పొలిటికల్ రీ-ఎంట్రీ వ్యూహం దాగి ఉందనే ప్రచారం గులాబీ, కాంగ్రెస్ వర్గాల్లో జోరందుకుంది.

మంత్రి పదవి పోగొట్టుకున్న సురేఖ 

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత కొండా దంపతులు తీవ్ర అభద్రతాభావం, ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో విబేధాలు, పార్టీ అధిష్టానం వద్ద ప్రాధాన్యత తగ్గడం, స్థానిక వరంగల్ కాంగ్రెస్ క్యాడర్‌లో మద్దతు కరువవ్వడంతో కొండా సురేఖ రాజకీయం సంక్షోభంలో పడింది. ఈ తరుణంలో తమ రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి మళ్లీ గులాబీ గూటికి చేరుకోవడమే సరైన ప్రత్యామ్నాయమనే ముగింపునకు కొండా దంపతులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీఆర్ఎస్‌లోకి  ఘర్ వాపసీ  చేయాలంటే కేటీఆర్‌తో ఉన్న వ్యక్తిగత శత్రుత్వమే ఏకైక అతిపెద్ద అడ్డంకిగా మారింది. ఆ రాజకీయ, వ్యక్తిగత ప్రతిబంధకాన్ని తొలగించుకోవడంలో భాగమే ఈ క్షమాపణల పర్వమని  భావిస్తున్నారు.

ఘర్ వాపసీ చర్చలకు క్షమాపణలు మొదటి అడుగు

ఈ పరిణామం వెనుక మరో బలమైన ప్రచారం కూడా నడుస్తోంది. సురేఖ ఈ రకంగా ఆకస్మికంగా క్షమాపణ చెప్పడం వెనుక బీఆర్ఎస్ అగ్రనేతలతో నడిచిన గుసగుసలు, రహస్య రాయబారాలు ఉన్నాయని గులాబీ క్వార్టర్స్ నుండి వార్తలు లీక్ అవుతున్నాయి. సొంత గూటికి రావాలంటే ముందుగా కేటీఆర్‌పై చేసిన అసత్య ప్రచారాన్ని ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి  అనే షరతును బీఆర్ఎస్ పెద్దలు విధించారని, ఆ వ్యూహం మేరకే సోషల్ మీడియాలో ఈ సారీ పోస్ట్ పడిందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కన్విక్షన్ పడే ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇది ఎంతో కొంత లీగల్ కవరేజ్ ఇస్తుండటంతో పాటు, బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు క్లీన్ చిట్ సాధించినట్లవుతుందని కొండా వర్గం భావిస్తోంది.

మేడం అంటూ సంబోధించిన కేసీఆర్ - కేసును వెనక్కి తీసుకునే చాన్స్

ఇక ఈ క్షమాపణల వ్యవహారంపై కేటీఆర్ స్పందించిన తీరు కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది.  నిజం ఎప్పటికైనా నిలకడగానే తేలుతుంది.. మొన్న ఒక పత్రిక, నేడు ఒక మేడం క్షమాపణ చెప్పారు, రేపు ముందస్తు వరుసలో క్షమాపణలు చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు  అని వ్యాఖ్యానించిన కేటీఆర్.. తమ లీగల్ టీమ్‌తో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని మీడియాకు తెలిపారు. సురేఖ క్షమాపణను పూర్తిగా తిరస్కరించకపోవడం, విమర్శలను పరోక్షంగా సడలించే సంకేతాలు ఇవ్వడంతో.. బీఆర్ఎస్ గుమ్మం కొండా దంపతుల కోసం తలుపులు తెరుచుకునే అవకాశాలు లేకపోలేదని   భావిస్తున్నారు.

కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే   

ఒకవేళ కొండా దంపతులు వరంగల్ రాజకీయాల్లో మళ్లీ కారు గుర్తు కిందకు రీ-ఎంట్రీ ఇస్తే, అది అధికార కాంగ్రెస్ పార్టీకి గొంతులో పచ్చివెలక్కాయలా మారడం ఖాయం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన బిసి సామాజిక వర్గ నేతలుగా, తమకంటూ సొంత క్యాడర్‌ను కలిగిన కొండా దంపతుల కలసిరాక.. రేవంత్ రెడ్డి సర్కార్‌పై ప్రతిదాడి చేయడానికి బీఆర్ఎస్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. రాబోయే కార్పొరేషన్   ఎన్నికలు, శాసనసభ ఉపఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేసి, కాంగ్రెస్‌లోని ఇతర అసమ్మతి నేతలకు  బీఆర్ఎస్ తలుపులు తెరిచే ఉన్నాయి  అనే బలమైన సందేశాన్ని పంపేందుకు కేసీఆర్ ఈ అవకాశాన్ని వాడుకునే అవకాశం ఉంది. క్షమాపణ చెప్పడం ద్వారా కొండా సురేఖ పొలిటికల్ చెస్‌బోర్డ్‌లో తన వద్ద ఉన్న ప్రధానమైన పావును కదిపారు. తప్పు తెలుసుకుని తగ్గిన ఆమెకు కేటీఆర్, కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానిస్తే.. తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ కేంద్రంగా మరో సంచలనం నమోదు కావడం ఖాయం. పరువు నష్టం కేసు విరమణతో ప్రారంభమై రాజకీయ పునరాగమనానికి దారితీసే ఈ  సారీ డ్రామా  రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను ఎలాంటి ఇరకాటంలో పడేస్తుందో వేచి చూడాలి.