హైదరాబాద్: ఎల్‌నినో ప్రతికూల వర్షాభావ పరిస్థితులు హైదరాబాద్‌ మహానగర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.  నగరంలోని ప్రధాన తాగునీటి ఆధారాలైన మంజీర, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోతుండటమే దీనికి కారణం. హైదరాబాద్ సిటీ పరిధిలో మొత్తం 22 నియోజకవర్గాలు ఉండగా.. అందులో మంజీరా పైపులైన్లు ఉన్న 9 నియోజకవర్గాల్లో నీటి సమస్య తీవ్రమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నీటి ముప్పును తిప్పికొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

హైదరాబాద్ సిటీకి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలతో పాటు మంజీరా, సింగూరు, కృష్ణా, గోదావరి జలాల నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా, జంట జలాశయాల్లో ఉన్న నీటిని రాబోయే 360 రోజులకు సరిపోయేలా జలమండలి ప్లాన్ చేసింది. సాధారణంగా సరఫరా చేయాల్సిన 40 ఎంజీడీలకు (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) బదులుగా.. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం 27 ఎంజీడీలను మాత్రమే అందిస్తున్నారు.

సింగూరు జలాశయ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 3.029 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మంజీరాలో 1.50 టీఎంసీలకుగాను కేవలం 0.19 టీఎంసీల నీరు ఉంది. ఈ రెండు జలాశయాల్లో కలిపి కేవలం 10 శాతం నీరు మాత్రమే ఉంది. నీటి ఆవిరి, పైపులైన్ల లీకేజీలు పోను ఈ నిల్వలు గరిష్ఠంగా మరొక 60 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. అందుకే ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి, అది కూడా కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే నీటిని సరఫరా చేస్తున్నారు.

ఈ నియోజకవర్గాలకు కష్టమే..

మంజీరా ఆధారిత ప్రాంతాలైన కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, సనత్‌నగర్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. శేరిలింగంపల్లి ఐటీ కారిడార్ తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్, బంజారాహిల్స్, సోమాజిగూడ, నార్సింగి, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మంజీరా పైపులైన్లను గోదావరి ఫేజ్-1తో అనుసంధానించేందుకు జలమండలి ప్లాన్ చేసింది. ఎల్లంపల్లి జలాశయంలో 20.17 టీఎంసీల సామర్థ్యానికి గాను 17.703 టీఎంసీల నిల్వలు ఉన్నాయి.  ఈ నిల్వలను కేవలం తాగునీటి అవసరాలకే పరిమితం చేస్తే హైదరాబాద్ సిటీకి వచ్చే ఏడాది వేసవి పూర్తయ్యేవరకు నీటి కొరత తలెత్తదు.

మంజీరా పైపులైన్లను గోదావరి సరఫరా వ్యవస్థకు అనుసంధానించే పనులు  యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. రాబోయే 2 నెలల్లో ಈ పనులు పూర్తయితే హైదరాబాద్ నగరం నీటి గండం నుంచి క్షేమంగా బయటపడుతుందని జలమండలి అధికారులు భావిస్తున్నారు. క్యూర్ పరిధిలో జనాభా 1.32 కోట్ల వరకు ఉండగా.. 14.50 లక్షల వాటర్ ట్యాప్స్ ఉన్నాయి. ప్రతిరోజూ 560 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది.