Yellow City: భారతీయ వంటకాల్లో, సంప్రదాయాల్లోనూ పసుపుది కీలకపాత్ర. ఇది లేకుండా.. మనకు ఏ పనీ జరగదు. అలా మన దేశంలో పండే ఈ పసుపు.. ప్రపంచ మార్కెట్ ని రూల్ చేస్తుందని తెలుసా?
పసుపు అనగానే మన అందరికీ గర్తుకు వచ్చేది పవిత్రత. హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం జరగాలన్నా.. పసుపు ఉండాల్సిందే. అంతేకాదు.. మనం ఇంట్లో చేసుకునే వంటకు మంచి రంగును అందించడం దగ్గర నుంచి, వంటింటి వైద్యం, పూజా పునస్కారాల వరకు పసుపు మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. మరి ప్రపంచానికి ఇంతటి పసుపును అందిస్తూ, టర్మరిక్ సిటీ, ఎల్లో సిటీ గా పేరు గాంచిన ప్రాంతం ఏదో తెలుసా? భారత దేశంలో పసుపు ఉత్పత్తి చేసే ప్రదేశాలు ఏంటో చూద్దాం...
తమిళనాడులోని ఈరోడ్ నగరాన్ని ప్రపంచ వ్యాప్తంగా ‘టర్మరిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’ లేదా ఎల్లో సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పసుపు సాగు, దానికి సంబంధించిన వర్తకం, మార్కెట్ ధరలను నిర్ణయించడంలో ఈరోడ్ ప్రపంచంలోనే అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ నిర్ణయించే పసుపు ధరలే.. దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయ ఎగుమతులలో బెంచ్ మార్క్ గా పని చేస్తాయి.
ఈరోజ్ పసుపులోని అధిక కుర్కుమిన్ శాతం కారణంగా.. భారత ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకమైన జీఐ ట్యాగ్ గుర్తింపు కూడా ఇచ్చింది. ఈ ప్రాంతంలో ఎర్రటి నేలలు, అనుకూలమైన వర్షపాతం వల్ల ఇక్కడ చాలా నాణ్యమైన పసుపు పండుతుంది. తెలంగాణలోని నిజామాబాద్ తర్వాత భారత దేశంలోనే అతి పెద్ద నియంత్రిత పసుపు మార్కెట్ ఈరోడ్ లోనే ఉంది. ఇక్కడి నుంచి ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, అమెరికా దేశాలకు పసుపు ఎగుమతి అవుతుంది.
తమిళనాడులోని ఈరోడ్ ప్రపంచ పసుపు రాజధానిగా గుర్తింపు పొందితే, మహారాష్ట్రలోని సాంగ్లీ నగరం టర్మరిక్ సిటీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర మొత్తం పసుపు ఉత్పత్తిలో ఒక్క సాంగ్లీ జిల్లాలోనే దాదాపు 70 శాతం పసుపు ఉత్పత్తి అవుతుంది. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాచీనమైన, అతి పెద్ద పసుపు వర్తక కేంద్రాల్లో ఇది ఒకటి కావడం విశేషం.
సాంగ్లీ పసుపు కూడా జీఐ ట్యాగ్ గుర్తింపు పొందింది. ఇక్కడ లభించే పసుపు చూడటానికి కూడా చాలా అందంగా కనపడుతుంది. మంచి సువాసన కూడా వస్తుంది. 20వ శాతాబ్దం ప్రారంభం నుంచి ఇక్కడ పసుపు వేలం పాట వేస్తూ ఉంటారు.
మన సంస్కృతిలో పసుపు ప్రాధాన్యత...
మన సంస్కృతిలో పసుపు కేవలం వంటింటి మసాలా దినుసు మాత్రమే కాదు. ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా పరిగణిస్తారు. చర్మ సౌందర్యం పెంచుకోవడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు తగ్గేందుకు పసుపు పాలు కూడా మనకు మంచి ఔషధంలా పని చేస్తాయి. అంతేకాదు.. శుభకార్యాల్లో కీలక పాత్ర పోషించే ఈ పసుపు.. మన ప్రాచీన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం.

