Hyderabad Ranga Reddy Graduates MLC Polls: తెలంగాణ రాజకీయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. హైదరాబాద్-రంగాజిల్లా-మహాబూబ్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్వయంగా రంగంలోకి దిగాలని భావించడం, దానికి అధిష్ఠానం ఆమోద ముద్ర వేయడం ఇప్పుడు కమలదళంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవం రామచంద్రరావుకు ఉన్నప్పటికీ, రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి మళ్లీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అత్యంత ప్రమాదకరమైన పొలిటికల్ రిస్క్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో ఉండి ఎమ్మెల్సీగా పోటీ
సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా రాష్ట్ర అధ్యక్షుడు యావత్ రాష్ట్రంపై దృష్టి సారించి పార్టీని విజయతీరాలకు చేర్చాలి తప్ప, స్వయంగా ఒక నియోజకవర్గానికే పరిమితమై ప్రచారం చేసుకోవడం అరుదు. ఒకవేళ పట్టభద్రుల పోరులో ఫలితం తేడా వస్తే, వచ్చే మొదటి సవాలు రామచంద్రరావు నాయకత్వంపైనే. గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఓటమి ఎదురైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిన నైతిక బాధ్యత ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా ఆయన పోటీకి దిగుతున్నారా లేదా హైకమాండ్ ఆయనను ఈ రిస్కులోకి నెట్టిందా అనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలపై దాడి చేయాల్సిన కీలక సమయంలో, రాష్ట్ర అధ్యక్షుడు ఒకే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా తిరగడం బీజేపీ ప్రచార వేగానికి ఆటంకం కలిగిస్తుందనే ఆందోళన ఉంది. అయితే, రామచంద్రరావు వర్గం మాత్రం దీనిని విశ్వాస ప్రకటన గా చూస్తోంది. పట్టభద్రుల్లో బీజేపీకి ఉన్న తిరుగులేని ఇమేజ్ను, సీనియర్ న్యాయవాదిగా తనకున్న గుర్తింపును నమ్ముకుని, ఓటమి భయాన్ని పక్కనపెట్టి ఫ్రంట్ ఫుట్‌లో పోరాడుతున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అధ్యక్ష బాధ్యతలు మారుస్తారా?
మరోవైపు, ఢిల్లీ వర్గాల్లోనూ, తెలంగాణ బీజేపీ వర్గాల్లోనూ ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల వేదికగా తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పునకు పునాది పడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూల ఫలితం రాకపోతే, ఆ సాకుతో రామచంద్రరావు స్థానంలో మళ్లీ మాస్ లీడర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించేలా హైకమాండ్ పక్కా వ్యూహంతో ఉందనే ప్రచారం ఊపందుకుంది.
గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణ బీజేపీలో కనబడిన అగ్రెసివ్ మార్క్, క్షేత్రస్థాయి శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం కాస్త మందగించిందనే అభిప్రాయం కేడర్‌లో ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు గట్టి పోటీ ఇవ్వాలంటే మళ్లీ సంజయ్ వంటి దూకుడున్న నాయకుడే సరైన ఛాయిస్ అని భావిస్తున్న హైకమాండ్, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఆధారంగా తమ అసలు పొలిటికల్ గేమ్‌ను అమలు చేయవచ్చని భావిస్తున్నారు.
రామచంద్రరావుకు ఈ ఎమ్మెల్సీ పోటీ ఒక రకంగా కత్తిమీద సాము లాంటిది. గెలిస్తే తన అధ్యక్ష పదవిని మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా పార్టీపై పట్టు సాధించవచ్చు, కానీ ఏమాత్రం తేడా వచ్చినా పదవిని కోల్పోవడంతో పాటు బండి సంజయ్ రీ-ఎంట్రీకి దారులు సుగమం చేసినవారవుతారు. మరి ఈ రిస్క్ పొలిటికల్ గేమ్‌లో రామచంద్రరావు గట్టెక్కుతారో లేక బీజేపీ హైకమాండ్ రాసిన స్క్రిప్ట్‌కే పరిమితమవుతారో తేలేందుకు కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

