పెద్దవారితో పోలిస్తే చిన్నారుల్లో ఆకస్మిక గుండె ఆగిపోవడం చాలా అరుదు. అయితే ఇది అసాధ్యం మాత్రం కాదు. పిల్లల్లో కార్డియాక్‌ అరెస్ట్‌ రావడానికి గుండె సంబంధిత సమస్యలతో పాటు శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, షాక్‌ వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. పెద్దవారిలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ప్రధాన కారణంగా ఉండవచ్చు. కానీ పిల్లల్లో శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు, శరీరానికి ఆక్సిజన్‌ అందకపోవడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు కార్డియాక్‌ అరెస్ట్‌కు దారితీయవచ్చు. ఫోర్టిస్‌ ఆసుపత్రి పీడియాట్రిక్‌ కార్డియాలజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనితా సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిదేళ్ల చిన్నారిలో ఇలాంటి అత్యవసర గుండె సమస్యలు చాలా అరుదు. అయినప్పటికీ కొంతమంది పిల్లల్లో బయటకు కనిపించని గుండె సంబంధిత సమస్యలు ఉండవచ్చని, అవి ముందుగా గుర్తించబడకపోవచ్చని తెలిపారు.

చిన్నారుల్లో గుండె సమస్యలకు 9 ప్రధాన కారణాలు

పుట్టుకతో వచ్చే గుండె లోపాలు

కొంతమంది పిల్లలు పుట్టుకతోనే గుండె నిర్మాణంలో లోపాలతో జన్మిస్తారు. ఈ సమస్యల వల్ల గుండె రక్తాన్ని సరిగ్గా పంప్‌ చేయలేకపోవచ్చు. గుండె విద్యుత్‌ సంకేతాల పనితీరుపై కూడా ప్రభావం పడవచ్చు. చాలావరకు చిన్నతనంలోనే గుర్తించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా బయటపడతాయి.

గుండె స్పందనలో అసాధారణ మార్పులు

గుండె కొట్టుకునే వేగం, లయలో మార్పులు రావడం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు. లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్‌ (Long QT Syndrome), వోల్ఫ్‌-పార్కిన్సన్‌-వైట్‌ సిండ్రోమ్‌ (Wolff-Parkinson-White Syndrome) వంటి సమస్యలు గుండె విద్యుత్‌ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీంతో గుండె వేగంగా లేదా అసాధారణంగా కొట్టుకుని కార్డియాక్‌ అరెస్ట్‌కు దారితీయవచ్చు.

కార్డియోమయోపతి

గుండె కండరాలకు సంబంధించిన వ్యాధులను కార్డియోమయోపతి అంటారు. ఈ సమస్యలో గుండె కండరాలు మందంగా మారడం, బలహీనపడటం లేదా గట్టిపడటం జరుగుతుంది. ఫలితంగా గుండె రక్తాన్ని సరిగ్గా పంప్‌ చేయలేకపోవచ్చు. హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి (Hypertrophic Cardiomyopathy) దీనికి ఒక ఉదాహరణ. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి వంశపారంపర్యంగా కూడా రావచ్చు.

మయోకార్డైటిస్‌

గుండె కండరాలకు వాపు రావడాన్ని మయోకార్డైటిస్‌ అంటారు. సాధారణంగా వైరల్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ సమస్య రావచ్చు. దీని వల్ల గుండె రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం తగ్గడంతో పాటు గుండె స్పందనలో అసాధారణ మార్పులు రావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో గుండె వైఫల్యం లేదా కార్డియాక్‌ అరెస్ట్‌ సంభవించవచ్చు.

తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు

ఆస్తమా తీవ్రతరం కావడం, న్యుమోనియా, శ్వాసనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం, ఆహారం గొంతులో ఇరుక్కోవడం, నీటిలో మునిగిపోవడం వంటి సమస్యల వల్ల శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోవచ్చు. పరిస్థితి తీవ్రమైతే గుండె పనిచేయడం ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.

తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, సెప్సిస్‌

శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ ఏర్పడి సెప్సిస్‌కు దారితీస్తే రక్తపోటు బాగా పడిపోవచ్చు. దీంతో గుండె, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్తం, ఆక్సిజన్‌ అందక షాక్‌ ఏర్పడుతుంది. ఇది ప్రాణాపాయ పరిస్థితికి దారితీయవచ్చు.

తీవ్రమైన అలర్జీ ప్రతిచర్యలు

కొన్ని ఆహార పదార్థాలు, మందులు లేదా ఇతర పదార్థాల వల్ల తీవ్రమైన అలర్జీ రావచ్చు. దీనిని అనాఫైలాక్సిస్‌ (Anaphylaxis) అంటారు. ఈ పరిస్థితిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం జరుగుతుంది. వెంటనే చికిత్స అందకపోతే కార్డియాక్‌ అరెస్ట్‌ సంభవించవచ్చు.

శారీరక గాయాలు

తీవ్రమైన ప్రమాదాలు, ఛాతీకి బలమైన గాయాలు, అధిక రక్తస్రావం వంటి పరిస్థితులు శరీరంలో షాక్‌కు కారణమవుతాయి. దీంతో గుండె, మెదడుకు సరిపడా రక్తం, ఆక్సిజన్‌ అందక ప్రాణాపాయం ఏర్పడవచ్చు.

గుర్తించని గుండె సంబంధిత సమస్యలు

కొంతమంది పిల్లల్లో గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే గుండె స్పందన సమస్యలు, కార్డియోమయోపతి వంటి వ్యాధులు ముందుగా గుర్తించబడకుండా ఉండవచ్చు. అందుకే పిల్లల్లో కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

  • వ్యాయామం లేదా ఆటల సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం.
  • శారీరక శ్రమ చేసినప్పుడు ఛాతీలో నొప్పి రావడం.
  • కారణం లేకుండా తరచూ మూర్ఛపోవడం.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
  • గుండె వేగంగా లేదా అసాధారణంగా కొట్టుకోవడం.
  • కుటుంబంలో చిన్న వయసులోనే ఆకస్మిక గుండె మరణాల చరిత్ర ఉండటం.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా వ్యాయామ సమయంలో స్పృహ కోల్పోవడం లేదా ఛాతీ నొప్పి రావడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చినప్పుడు ఏం చేయాలి?

కార్డియాక్‌ అరెస్ట్‌ అనేది అత్యవసర వైద్య పరిస్థితి. చిన్నారి అకస్మాత్తుగా కుప్పకూలి స్పందించకపోతే, సాధారణంగా శ్వాస తీసుకోకపోతే లేదా కేవలం గ్యాస్పింగ్‌ చేస్తుంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం కోరాలి. వెంటనే అంబులెన్స్‌ కోసం 112 లేదా స్థానిక అత్యవసర సేవలకు కాల్‌ చేయాలి. చిన్నారికి స్పందన ఉందో లేదో, శ్వాస సాధారణంగా ఉందో లేదో పరిశీలించాలి. సీపీఆర్‌ (CPR) తెలిసిన వ్యక్తి వెంటనే ప్రారంభించాలి. అందుబాటులో ఉంటే ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ (AED) ఉపయోగించాలి. వైద్య సిబ్బంది వచ్చే వరకు అత్యవసర సహాయాన్ని కొనసాగించాలి. పిల్లలకు సీపీఆర్‌ చేసే విధానం పెద్దవారితో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. అందువల్ల శిక్షణ పొందిన వ్యక్తులు తగిన విధంగా చేయడం ముఖ్యం.

ప్రతి నిమిషం విలువైనదే!

కార్డియాక్‌ అరెస్ట్‌ సంభవించినప్పుడు ప్రతి నిమిషం ఎంతో కీలకం. సకాలంలో సీపీఆర్‌ చేయడం, ఏఈడీ (AED) అందుబాటులో ఉండటం ప్రాణాలను కాపాడే అవకాశాలను గణనీయంగా పెంచుతాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రాథమిక ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడం కూడా ఎంతో అవసరం. పిల్లల్లో ఆకస్మిక గుండె ఆగిపోవడం అరుదైనప్పటికీ, ముందుగా గుర్తించని గుండె సమస్యలు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు. పిల్లల్లో కనిపించే అసాధారణ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.