Moto Buds 2 Ultra Launched: మోటరోలా (Motorola) కొత్త ప్రీమియం వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. మోటో బడ్స్ 2 అల్ట్రా (Moto buds 2 ultra) పేరుతో విడుదల చేసిన ఈ ఇయర్‌బడ్స్‌లో ప్రముఖ ఆడియో సంస్థ బోస్ (Bose) సౌండ్ టెక్నాలజీని అందించింది. డ్యూయల్ డ్రైవర్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), AI ఆధారిత ఫీచర్లు ఇందులో ప్రత్యేకంగా నిలవనున్నాయి. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే మొత్తం 37 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది.
Moto Buds 2 Ultraలో బోస్ సౌండ్ డిజైన్ ట్యూనింగ్‌తో కూడిన డ్యూయల్ డ్రైవర్ సెటప్ అందించారు. ఇందులో 11mm డైనమిక్ డ్రైవర్ తక్కువ ఫ్రీక్వెన్సీ సౌండ్‌ను అందిస్తుండగా, ప్రత్యేకమైన Balanced Armature డ్రైవర్ మిడ్, హై ఫ్రీక్వెన్సీ ఆడియోను నిర్వహిస్తుంది. Hi-Res Audio సర్టిఫికేషన్ కూడా ఉంది. అనుకూలమైన మోటరోలా స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ చేసినప్పుడు డాల్బీ అట్మాస్, డాల్బీ హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌లో బోస్ క్వైట్కంట్రోల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) టెక్నాలజీ అందించారు. చుట్టుపక్కల శబ్దాల తీవ్రతను బట్టి నాయిస్ క్యాన్సిలేషన్ స్థాయిని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. అలాగే “ట్రాన్స్పరెన్సీ మోడ్” ద్వారా అవసరమైనప్పుడు బయట శబ్దాలను కూడా వినవచ్చు.
కాల్ క్వాలిటీ కోసం ఒక్కో ఇయర్‌బడ్‌లో మూడు హై SNR మైక్రోఫోన్లతో పాటు ప్రత్యేక వాయిస్ పికప్ యూనిట్ (VPU) అందించారు. ఇవి మాట్లాడే వారి గొంతును స్పష్టంగా గుర్తించి బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఇయర్‌బడ్స్‌లో పలు ఆసక్తికరమైన స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అనుకూలమైన మోటరోలా స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ చేస్తే AI లైవ్ ట్రాన్స్‌లేట్ ద్వారా ఇతర భాషల్లో మాట్లాడే మాటలను రియల్‌టైమ్‌లో అనువదించుకోవచ్చు. ఎడమ ఇయర్‌బడ్‌ను ఎక్కువసేపు ప్రెస్ చేయడం ద్వారా మోటోరోలా Qira వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయవచ్చు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ‘Hey Qira’ వాయిస్ కమాండ్ సపోర్ట్ కూడా అందించనున్నారు.
ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. తల ఊపడం లేదా అటూ ఇటూ కదిలించడం ద్వారా కాల్స్‌ను ఆన్సర్ లేదా రిజెక్ట్ చేయవచ్చు. ఇయర్‌బడ్‌ను చెవి నుంచి తీసినప్పుడు మ్యూజిక్ ఆటోమేటిక్‌గా పాజ్ అవుతుంది. “డ్యూయల్ కనెక్షన్” ద్వారా ఒకేసారి రెండు బ్లూటూత్ డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా “ఆడియో షేర్” ఫీచర్‌తో ఒకే డివైజ్ నుంచి రెండు సెట్ల అనుకూల ఇయర్‌బడ్స్‌కు ఆడియోను షేర్ చేయవచ్చు.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ గరిష్ఠంగా 8 గంటల ప్లేబ్యాక్ అందిస్తాయి. ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 37 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌తో పాటు Qi2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇవి బ్లూటూత్ 6.0 కనెక్టివిటీతో పనిచేస్తాయి. ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేసు రెండింటికీ IP57 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లలో “మోటో బడ్స్” యాప్ ద్వారా సెట్టింగ్స్, ఫర్మ్‌వేర్ అప్డేట్స్ నిర్వహించుకోవచ్చు. “గూగుల్ ఫైండ్ హబ్” సపోర్ట్‌తో పోగొట్టుకున్న ఇయర్‌బడ్స్‌ను గుర్తించే అవకాశం కూడా ఉంది.
Moto Buds 2 Ultra ప్రారంభ ధరను 199 యూరోలుగా (సుమారు రూ.21,110) నిర్ణయించారు. అలాగే 179.99 బ్రిటిష్ పౌండ్ల ధరకు కూడా అందుబాటులోకి రానున్నాయి. పాంటోన్ రిఫ్లెక్టింగ్ పాండ్, పాంటోన్ టెంపుల్ గ్రే అనే రెండు రంగుల్లో విడుదల అయ్యింది. రాబోయే వారాల్లో యూరప్, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో లాంచ్ తేదీ, ధరపై మోటరోలా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

