YS Jagan Amaravati Capital Stance Rethink:   ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి  రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి.   ముఖ్యంగా ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు   నగరాల క్లస్టర్  ప్రతిపాదన ప్రాంతీయంగా ఏమాత్రం ప్రజామోదం పొందలేకపోయిందని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అమరావతి పరిసర పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేయగా, వైఎస్సార్‌సీపీ నామమాత్రపు డివిజన్లకే పరిమితమై దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది.

గతంలో మూడు రాజధానుల నిర్ణయంతో సమస్యలు

గతంలో  మూడు రాజధానుల నినాదంతో అమరావతి ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురైన వైఎస్సార్‌సీపీ, ఇటీవల అమరావతికి పోటీగా లేదా దానికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కంబైన్డ్ డెవలప్‌మెంట్ రీజియన్‌గా  మావిగన్ అనే కాన్సెప్ట్‌ను విపరీతంగా ప్రచారం చేసింది. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అజెండాతోనే బరిలోకి దిగుతామని జగన్ సవాలు విసిరారు. అయితే, ఈ మున్సిపల్ పోరును ఆ నినాదానికి ప్రాక్టికల్ పరీక్షగా భావిస్తే.. బెజవాడ, గుంటూరు, బందర్ పట్టణ ఓటర్లు మావిగన్ ప్రతిపాదనను తిరస్కరించి, ఏకైక రాజధానిగా అమరావతి నిర్మాణానికే తమ ఓటుతో జై కొట్టారని భావిస్తున్నారు.

భారీ తేడాతో ఓడిపోయిన వైసీపీ 

స్థానిక ఫలితాల సరళిని గమనిస్తే.. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో మెజార్టీ డివిజన్లను కూటమి తన ఖాతాలో వేసుకుంది. అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, గ్రీన్ ఫీల్డ్ మెట్రో ప్లాన్లు ,  కూటమి ప్రభుత్వం తెస్తున్న ఐటీ, పారిశ్రామిక ప్రాజెక్టులపై ఆధారపడి స్థానిక వ్యాపారులు, యువత, పట్టణ నగరవాసులు కూటమికి బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించే ప్రత్యామ్నాయ రాజధాని ఆలోచనలు కేవలం రియల్ ఎస్టేట్ గందరగోళానికి, అభివృద్ధి నిలిచిపోవడానికే కారణమవుతున్నాయనే భావన పట్టణ ప్రజల్లో వ్యక్తమైంది.

అమరావతిపై తన స్టాండ్ మార్చుకుంటారా? 

ఈ ఘోర పరాజయం తర్వాతైనా వైఎస్ జగన్ తన రాజధాని స్టాండ్‌పై పునరాలోచన చేస్తారా? అమరావతిని ఏకైక రాజధానిగా అంగీకరిస్తారా? అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గతంలో 2019 కంటే ముందు అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు, ఆ తర్వాత మావిగన్ వంటి ప్రతిపాదనలతో నిలకడలేని వైఖరి ప్రదర్శించారని ఓటర్లు భావించారు. ఎన్నికల్లో ప్రజలు వరుసగా తిరస్కరిస్తున్నప్పటికీ, తన  ఈగో, పాత పట్టుదలకు పోయి రాజధాని మార్పు నినాదాన్నే పట్టుకుని వేలాడితే.. పార్టీ భవిష్యత్తుకే మరింత నష్టం చేకూరుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలే అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు.

ప్రజాతీర్పునకు అనుగుణంగా మారాలి కదా ! 

రాజకీయాల్లో ప్రజా తీర్పును గౌరవించి వ్యూహాలు మార్చుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణం. కర్నూలు, విశాఖ, అమరావతి వికేంద్రీకరణ కాన్సెప్ట్ కానీ, లేదా కొత్తగా తెచ్చిన  మావిగన్ పొలిటికల్ నెరేటివ్ కానీ క్షేత్రస్థాయిలో ప్రజలను మభ్యపెట్టలేకపోయాయని ఈ ఫలితాలు తేల్చిచెప్పాయి. ఈ పరాజయం నేర్పిన పాఠంతోనైనా జగన్ అమరావతిపై తన వైఖరిని మార్చుకుని, వింతైన ప్రయోగాలకు స్వస్తి చెప్పి, ఏకైక రాజధాని అమరావతికి జై కొడితేనే వైఎస్సార్‌సీపీకి మళ్లీ కోల్పోయిన రాజకీయ విశ్వసనీయత లభించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పట్టణ ఓటరు ఏకైక   అమరావతి రాజధానికే తమ పటిష్ట మద్దతు ఉందని సస్పెన్స్ లేకుండా తీర్పునిచ్చారు. ప్రయోగాత్మక ప్రతిపాదనల కంటే నిలకడైన అభివృద్ధి, అమరావతి నిర్మాణమే రాష్ట్రానికి శ్రేయస్కరమని ప్రజలు స్పష్టం చేసిన వేళ.. జగన్ మోహన్ రెడ్డి తన అమరావతి వ్యతిరేక రాజకీయ అజెండాను పక్కనబెడతారో లేక పాత బాటలోనే పయనిస్తారో రాబోయే రోజుల్లో తేలనుంది.