Delhi Capitals IPL 2027 Auction Plan: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. కొత్తగా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. రాబోయే వేలంలో టీమ్ టార్గెట్ ఏంటో వెల్లడించారు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్‌ను జట్టులోకి తీసుకోవాలని తాము భావిస్తున్నట్లు దాదా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబరు 16న గోవాలో జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలను సమర్పించే గడువును నవంబరు 17 వరకు పొడిగించినట్లు సమాచారం.
టార్గెట్ ఆ ఇద్దరే:
డీసీ హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ 2027 మినీ వేలంకు మేము సిద్దమవుతున్నాం. ఇంకా పటిష్ట జట్టును తయారుచేయాలి. మా దృష్టిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రేజర్ మెక్‌గుర్క్, వెస్టిండీస్‌కు చెందిన షాయ్ హోప్‌ను జట్టులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం. వీరిద్దరితో జట్టు బ్యాటింగ్ బలం పెరగనుంది’ అని చెప్పారు. దాదా వ్యాఖ్యలతో ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్ అయింది. ఐపీఎల్ 2027 మినీ వేలంలో మెక్‌గుర్క్, హోప్‌లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు గంగూలీ వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిగతా టీమ్స్ కూడా హోప్‌పై కన్నేసిన విషయం తెలిసిందే. చూడాలి మరి హోప్ ఏ జట్టుకు ఆడుతాడో.
సౌరవ్ గంగూలీ ఆసక్తి:
మెక్‌గుర్క్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా జట్టులోకి వచ్చిన అతడు.. తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 9 మ్యాచ్‌లలో 330 రన్స్ చేశాడు. ఆ తర్వాత జరిగిన మెగా వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించి అతడిని తిరిగి జట్టులోకి తీసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.9 కోట్లు ఖర్చు చేసింది. ఐపీఎల్ 2026లో అతడిని ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్ 385 పరుగులు చేశాడు. 25.67 సగటు, 199.49 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం అతడి ప్రత్యేకత. మరోవైపు షాయ్ హోప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2024 సీజన్ కోసం రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఒక్క సీజన్ తర్వాత అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఇప్పుడు హోప్ పరుగుల వరద పారిస్తున్నాడు. దాంతో మరోసారి అతడిని తీసుకోవాలని సౌరవ్ గంగూలీ ఆసక్తి చూపుతున్నారు.
కోచింగ్ విభాగంలోనూ కీలక మార్పులు:
ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ విభాగంలోనూ కీలక మార్పులు చేపట్టింది. ప్రధాన కోచ్‌గా సౌరవ్ గంగూలీని నియమించడంతో పాటు.. భారత మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు స్పిన్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది. యువరాజ్ సింగ్‌ను అసిస్టెంట్ కోచ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఈ మార్పులతో రాబోయే సీజన్‌కు కొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఢిల్లీ.. ఈసారి జట్టు కూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2025, 2026 సీజన్లలో హేమంగ్ బదానీ ప్రధాన కోచ్‌గా, వేణుగోపాల్ రావు క్రికెట్ డైరెక్టర్‌గా, మునాఫ్ పటేల్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో జట్టు ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. 2020లో మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. ఈ నేపథ్యంలో దాదా నేతృత్వంలో జట్టును కొత్త దిశగా నడిపించాలని ఫ్రాంచైజీ భావిస్తోంది.

