IPL Players Retention Fee: ఐపీఎల్‌లో మరో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న మెగా వేలానికి ముందే కొందరు స్టార్ ఆటగాళ్లు తమ రిటెన్షన్ ఫీజు విషయంలో భారీగా డిమాండ్లు చేస్తున్నట్లు సమాచారం. తమను జట్టులో కొనసాగించాలంటే.. రూ.40 కోట్లు చెల్లించాలని కొన్ని ఫ్రాంచైజీల ముందు ప్రతిపాదించినట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. కొందరు టాప్‌ ప్లేయర్లు తమ రిటెన్షన్ మొత్తంను రూ.40 కోట్లుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు నిర్వహించనున్న మినీ వేలం ప్రస్తుత వేలం చక్రంలో చివరిది కానుంది. ఆ తర్వాత 2028 సీజన్ కోసం మెగా వేలం జరగనుంది. సాధారణంగా మినీ వేలంలో జట్లకు ఐదు నుంచి ఆరు స్థానాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ మెగా వేలంలో ఫ్రాంచైజీలు తమ జట్లను దాదాపు కొత్తగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. అందుకే మెగా వేలంపై ఆటగాళ్లు, అభిమానులు, ఫ్రాంచైజీల్లో భారీ ఆసక్తి నెలకొంటుంది. ఈ మెగా వేలం 2027 డిసెంబరులో జరిగే అవకాశం ఉంది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. రూ.40 కోట్ల రిటెన్షన్ ఫీజు చెల్లిస్తే జట్టులో కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొందరు టాప్ ప్లేయర్స్ తమ ఫ్రాంచైజీలకు సమాచారం పంపించారు. వేలంలో తమకు భారీ ధర పలికే అవకాశం ఉందని భావిస్తున్న మరికొందరు ఆటగాళ్లు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశముందని నివేదిక పేర్కొంది.

ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడి కోసం వేలంలో చెల్లించిన అత్యధిక మొత్తం ప్రస్తుతం రూ.27 కోట్లు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఈ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు కొందరు ఆటగాళ్లు రిటెన్షన్ కోసం ఏకంగా రూ.40 కోట్లు కోరుతున్నారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఒక్కో ఐపీఎల్ జట్టు పర్స్ పరిమితి రూ.120 కోట్లుగా ఉంది. వచ్చే మెగా వేలం నాటికి ఈ మొత్తాన్ని సుమారు రూ.150 కోట్లకు పెంచే అవకాశం ఉందని క్రిక్‌బజ్ వెల్లడించింది. పర్స్ పెరిగితే ఆటగాళ్ల కొనుగోళ్లు, రిటెన్షన్ వ్యూహాల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.

మరోవైపు ఐపీఎల్ 2027 మినీ వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్, విడుదల జాబితాలను సమర్పించే గడువును బీసీసీఐ రెండు రోజులు పొడిగించింది. తొలుత నవంబరు 15గా నిర్ణయించిన గడువును నవంబరు 17 వరకు పెంచినట్లు సమాచారం. ఈ మినీ వేలం డిసెంబరు 16న గోవాలో జరగనుంది. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, విడుదల జాబితాలను సమర్పించిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను ఐపీఎల్ యాజమాన్యం జట్లకు అందిస్తుంది. అనంతరం ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేస్తాయి. వేలానికి ముందు వారంలో తుది ఆటగాళ్ల జాబితా, వేలం సెట్ల క్రమాన్ని ప్రకటించనున్నారు.

ఇప్పటికే వేలానికి ముందు రెండు కీలక ఆటగాళ్ల ట్రేడ్లు జరిగాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తిరిగి జట్టులోకి తీసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టుకు వెళ్ళాడు. మరో ట్రేడ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ టీ. నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పంపించింది. ప్రతిగా లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని తీసుకుంది. ఈ మార్పులతో మూడు జట్ల కూర్పులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తంగా ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు రిటెన్షన్ గడువు, ఆటగాళ్ల ట్రేడ్లు, భారీ రిటెన్షన్ డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి.