Xiaomi 18 Pro and 18 Pro Max Global Launch: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ మరోసారి ప్రీమియం ఫోన్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు Xiaomi 18 Pro, Xiaomi 18 Pro Maxలను ఈ నెలలోపల అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్లలో Snapdragon 8 Elite Gen 6 సిరీస్ ప్రాసెసర్లు, 200MP కెమెరాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి.

Xiaomi 18 Pro

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. వెనుకవైపు 2.7 అంగుళాల AMOLED సెకండరీ డిస్‌ప్లే కూడా అందించారు. Snapdragon 8 Elite Gen 6 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఉన్నాయి. Android 17 ఆధారిత HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. OIS సపోర్ట్‌తో కూడిన 200MP ప్రైమరీ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఇచ్చారు. ఇందులో 7,000mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే 27W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

Xiaomi 18 Pro Max

ఈ సిరీస్‌లో పెద్ద మోడల్ అయిన Xiaomi 18 Pro Maxలో 6.9 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. వెనుకవైపు 2.9 అంగుళాల AMOLED సెకండరీ స్క్రీన్ అందించారు. Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఉన్నాయి. కెమెరాల పరంగా 200MP ప్రైమరీ సెన్సార్, 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ కూడా Android 17 ఆధారిత HyperOS 4పై పనిచేస్తుంది.

షావోమీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ నెలలోనే గ్లోబల్ మార్కెట్లో ఈ రెండు ఫోన్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇటలీకి చెందిన రిటైలర్ Epto వెబ్‌సైట్‌లోనూ ఈ ఫోన్ల వివరాలు కనిపించాయి. చైనా వేరియంట్లలో ఉన్న స్పెసిఫికేషన్లే అంతర్జాతీయ మోడళ్లలోనూ ఉండే అవకాశం ఉంది. అయితే గ్లోబల్ ధరలు, భారత్‌లో లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.