Delhi Election Commission Protest INDIA Alliance:  ఓటు చోరీ అంటూ ప్రతిపక్ష  ఇండి  కూటమి నిర్వహిస్తున్న  పోరాటం జాతీయ రాజకీయాల్లో నూతన అధ్యాయానికి తెరతీసింది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రాంతీయ పార్టీల అధినేతల నుండి అనేక సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి. అయితే, గడిచిన కొద్ది నెలలుగా వీధులెక్కి ఆయన చేస్తున్న నిరంతర పోరాటాలు, ముఖ్యంగా ఎన్నికల సంఘం వైఖరి, ఓటర్ల జాబితా లెక్కింపు వ్యూహాలు ,  జాతీయ అంశాలపై విపక్షాలను ఏకం చేస్తున్న తీరు.. కూటమి సారథ్యానికి రాహుల్ గాంధీని సహజసిద్ధమైన నాయకుడిగా నిలబెట్టాయి.

ప్రాంతీయ పార్టీల సానుకూలత

గతంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ సుప్రీమో మమతా బెనర్జీ వంటి సీనియర్ ప్రాంతీయ నేతలు కాంగ్రెస్ పెద్దరికాన్ని లేదా రాహుల్ గాంధీ ఏకపక్ష నిర్ణయాలను బహిరంగంగానే తప్పుపట్టేవారు. కానీ, మారిన జాతీయ రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రాంతీయ క్షాత్రంలో సర్దుబాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తన ఉనికిని కాపాడుకుంటూ రాష్ట్రాధికారంపై దృష్టి పెట్టడానికి కాంగ్రెస్ మద్దతు ఎంత కీలకమో అఖిలేష్ గుర్తిస్తే, పశ్చిమ బెంగాల్‌లో వరుస వివాదాలు, జాతీయ దర్యాప్తు సంస్థల ఒత్తిళ్ల నడుమ కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణించడం మమతా బెనర్జీకి కూడా అనివార్యంగా మారింది.

రాహుల్ నాయకత్వానికి అందరూ ఓకే   

ఢిల్లీలో ఇటీవల జరిగిన భారీ నిరసన ర్యాలీలు, సభల్లో కూటమికి చెందిన దాదాపు అన్ని భాగస్వామ్య పక్షాలు రాహుల్ గాంధీ నాయకత్వంలో వేదిక పంచుకోవడం ఆయన నేతృత్వ పటిమకు నిదర్శనంగా మారింది. ఎన్నికల కమిషన్‌పై వారు చేపట్టిన  ఓటు చోరీ ఆందోళనకు ఎంతవరకు ప్రజల్లో పొలిటికల్ మైలేజీ లభిస్తుందనేది పక్కన పెడితే.. 'ఇండియా' కూటమిని ఒకే తాటిపైకి తెచ్చి కమలనాథులకు బలమైన పోటీదారుగా నిలబెట్టడంలో రాహుల్ గాంధీ విజయం సాధించారనేది నిరాక్షేపణీయమైన సత్యం. భారత్ జోడో యాత్ర నుంచి ప్రారంభమైన రాహుల్ గాంధీ ఇమేజ్ మేకోవర్, ఇప్పుడు  ఇండియా కూటమి ఆమోదయోగ్య నాయకుడిగా రూపాంతరం చెందింది. విధానపరమైన స్పష్టతతో పాటు, ఇతర ప్రాంతీయ నేతలతో అహం పక్కనపెట్టి సమన్వయం చేసుకోగలగడం,  రాహుల్ పొలిటికల్ మెచ్యూరిటీకి సంకేతంగా నిలిచింది.

ఇప్పటికి ఓకే.. ఎన్నికలనాటికి ఎలా ఉంటుందో?

ఈ నాయకత్వ ఆమోదం రాబోయే ఎన్నికల నాటికి 'ప్రధాని అభ్యర్థి'గా ఆయనను ఎలా ప్రతిష్ఠిస్తుందనేది ఆసక్తికరమైన అంశం. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు జాతీయ స్థాయిలో రాహుల్ పోరాటాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ఎవరి రాష్ట్రాల్లో వారు సీట్ల సర్దుబాట్లలో పట్టు వీడకపోవడం కాంగ్రెస్‌కు ఉన్న ప్రధాన సవాల్. ఈ అసమ్మతులను సమర్థవంతంగా సద్దుమణిగించి, రాబోయే సార్వత్రిక సమరానికి కూటమి యంత్రాంగాన్ని నడిపించడంలోనే రాహుల్ గాంధీకి నిజమైన అగ్నిపరీక్ష ఎదురుకానుంది. విమర్శకులు భావించినట్లుగా రాహుల్ గాంధీ కేవలం ఒక పార్ట్‌టైమ్ రాజకీయ నాయకుడు కారని, బీజేపీ శ్రేణులను ధీటుగా ఎదుర్కొనే విపక్ష నాయకుడిగా ఆయన సీనియర్ల అభ్యంతరాలన్నింటినీ దాటుకుని  ఇండియా  కూటమి తిరుగులేని నాయకత్వ హోదాను సాధించుకున్నారు.