పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజున రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నా చేపట్టడంతో పులివెందుల పోలీసులు వారిపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. వైఎస్సార్సీపీ వర్గాల ప్రకారం.. పులివెందుల పరిధిలోని పలు పోలింగ్ బూతుల్లో తమ పార్టీ ఏజెంట్లను లోపలికి రానివ్వకుండా అధికార టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయని, దొంగ ఓట్లు వేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, బూత్ క్యాప్చరింగ్ జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జగన్ స్వయంగా రోడ్డుపైకి వచ్చి ఆర్వో ఆఫీసు ముందు నిరసనకు దిగారు. మరోవైపు.. అధికార కూటమి, టీడీపీ నాయకులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఓటమి తథ్యమని గ్రహించే జగన్, అవినాష్ రెడ్డిలు పోలింగ్ రోజున నాటకాలు ఆడుతూ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించారని విమర్శించారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ధర్నాలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో పులివెందులలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ ఈ కేసులను రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతుండగా, ప్రభుత్వం శాంతిభద్రతల ఉల్లంఘనగానే దీనిని పరిగణిస్తోంది. జగన్‌పై కేసు నమోదు చేయడం అనేది పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఉన్న రాజకీయ పట్టును దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం వేస్తున్న వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.