Urban Local Body Polls Voter Psychology AP: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ముందే చాలా మంది ఓ అంచనాకు వచ్చారు. కౌంటింగ్ కేంద్రాల బయట విజయోత్సవాలు, పార్టీ కార్యాలయాల్లో సంబరాలు, నిరాశలతో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. పట్టణ ఓటరు మూడ్ ఏ దిశగా ఉందో ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఇవి కేవలం రాజకీయ పార్టీల, స్థానిక నాయకుల మానసిక స్థితి పై ప్రభావం చూపే అంశాలే తప్ప.. రాబోయే శాసనసభ అసెంబ్లీ ఎన్నికలకు ఇవే ముందస్తు ఫలితాల సూచికలు లేదా ప్రజామోదానికి తుది ల్యాండ్‌మార్క్ అనడం ఎంతమాత్రం సరికాదన్న అభిప్రాయం ఉంది.
స్థానిక ఎన్నికల ఓటింగ్ ప్రయారిటీ వేరు
స్థానిక సంస్థల ఎన్నికల స్వభావం, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నమూనా కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మున్సిపల్ పోరులో రాజకీయ పార్టీల గుర్తుపై పోటీ జరిగినప్పటికీ, పార్టీల ప్రాధాన్యత కంటే వ్యక్తిగత సంబంధాలు, అభ్యర్థి గుణగణాలు, లోకల్ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఓటరు తన వార్డులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, నిత్యం అందుబాటులో ఉండే కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ అభ్యర్థి ఎవరు అనే దానిపైనే ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంటారు. స్థానిక సమస్యలను పరిష్కరించగల వ్యక్తికి ఓటేస్తారు తప్ప, రాష్ట్రస్థాయి పార్టీ విధానాలు లేదా జాతీయ అంశాలు వార్డు స్థాయి బ్యాలెట్ బాక్సులను పెద్దగా ప్రభావితం చేయవు.
స్థానిక ఎన్నికల్లోఫలితాలు బలానికి సాక్ష్యం కావు!
చరిత్రను తిరగేస్తే.. మున్సిపల్ ఎన్నికలలో గెలిచినంత మాత్రాన ఆయా పార్టీలు తదుపరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాయనే గ్యారెంటీ ఎప్పుడూ లేదు. స్థానిక ఎన్నికలలో అధికార పక్షానికి ఎల్లప్పుడూ కొంత అధికారిక లబ్ధి , యంత్రాంగం సపోర్ట్, ఎన్నికల నిర్వహణ అనుకూలత ఉంటాయి. అయితే, శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి ఓటరు ప్రాధాన్యతలు ఒక్కసారిగా మారిపోతాయి. అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, రాష్ట్రాభివృద్ధికి ఏ పార్టీ సరిపోతుంది, సంక్షేమం ఎవరితో సాధ్యం అనే అంశాల ఆధారంగా స్థానిక అభ్యర్థితో సంబంధం లేకుండా ఓటు బ్యాంక్ రీ-అలైన్ అవుతుంది. ప్రస్తుతం పార్టీల కేడర్ మానసిక స్థితిపై మాత్రం బలమైన ప్రభావం చూపుతాయి.
ఫలితాలకు అనేక కారణాలు
గెలిచిన పార్టీకి తమ క్షేత్రస్థాయి యంత్రాంగంలో సరికొత్త ఉత్సాహం నిండుతుంది, నాయకులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓడిపోయిన పార్టీల్లో కార్యకర్తల నిరాశతో పాటు, నాయకత్వ వైఫల్యాలపై అంతర్గత అసంతృప్తి మొదలవుతుంది. ఈ మానసిక విజయం తాత్కాలికంగా పార్టీల ప్రచారాలకు, రాబోయే స్థానిక పోరాటాలకు శక్తిని ఇస్తుంది తప్ప, ఓటరు ఆలోచనా విధానం శాశ్వతంగా ఆ పార్టీ వైపే ఉందని భావిస్తే అది ఆయా పార్టీల రాజకీయ పొరపాటే అవుతుంది. సోషల్ మీడియా , పొలిటికల్ డిస్క్రిప్షన్లలో ఇదే ప్రజల తుది తీర్పు , "రాష్ట్ర రాజకీయాల్లో గాలి ఏటుందో తేలిపోయింది అంటూ పార్టీల మద్దతుదారులు చేసుకునే ప్రచారాలు కేవలం డిజిటల్ నెరేటివ్స్ మాత్రమే. పట్టణ ఓటరు అత్యంత తెలివైనవాడని, కార్పొరేషన్ స్థాయికి ఎవరిని ఎన్నుకోవాలో, రాష్ట్ర పీఠం ఎవరికి అప్పగించాలో స్పష్టమైన విభజన ప్రదర్శిస్తారని అనేక గత ఎన్నికల అనుభవాలు రుజువు చేశాయి.
రాజకీయ నేతలకు తెలుసు!
ఇవాళ వెలువడుతున్న పట్టణ ఫలితాలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల ఎంపికకు, పార్టీల క్యాడర్ బూస్టింగ్కు మాత్రమే పరిమితం. ఈ విజయాలను చూసి అధికార పక్షం అతివిశ్వాసానికి పోయినా, లేదా ప్రతికూల ఫలితాలను చూసి ప్రతిపక్షం పూర్తిగా ధైర్యం కోల్పోయినా పొరపాటే. అసెంబ్లీ రణరంగం వచ్చేసరికి సమీకరణాలు, అజెండాలు, ఓటరు తీర్పు పూర్తిగా మారుతాయనేదే స్థానిక ఎన్నికల రాజకీయం నేర్పిన అసలైన పాఠం.

