Rahul Gandhi Revanth Reddy Delhi Ramlila Maidan: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రామ్‌లీలా మైదానం వేదికగా ఇండియా కూటమి శ్రేణులు నిర్వహించిన ఓట్ బచావో.. దేశ్ బచావో ర్యాలీ జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వ ఎన్నికల విధానాలు, ఓటర్ల పేర్ల తొలగింపు చర్యలను నిరసిస్తూ నిర్వహించిన ఈ భారీ నిరసన ప్రదర్శనలో తెలంగాణ కాంగ్రెస్ చాటిన ప్రజాబలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరాభారం ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి నిర్వహించిన జనుల సమీకరణ జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని సైతం విస్తుపోయేలా చేసింది.
రేవంత్ కు హైకమాండ్ వద్ద మరిన్ని మార్కులు
ర్యాలీ సన్నాహాల సమయంలో కేంద్రం నుంచి ఎదురైన ఆటంకాలు, ప్రత్యేక రైళ్లు నిలిచిపోవడం వంటి పరిణామాలను సైతం అధిగమించి తెలంగాణ కాంగ్రెస్ యంత్రాంగం వందలాది స్లీపర్ బస్సులు, ప్రైవేటు వాహనాలు, విమానాల ద్వారా దాదాపు 8,000 మందికి పైగా శ్రేణులను ఢిల్లీకి చేర్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివెళ్లి సభలో పవర్ ప్రదర్శించారు. వేదికపై ప్రధాని మోదీ , ఎన్నికల కమిషన్ విధానాలపై రేవంత్ రెడ్డి వినిపించిన తీవ్రమైన ప్రసంగం ఢిల్లీ పీఠాన్ని కుదిపివేసేలా సాగింది. ఈ విజయవంతమైన జన సమీకరణ ప్రక్రియతో కాంగ్రెస్ హైకమాండ్ మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దృష్టిలో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ ఒక్కసారిగా రీ-డిఫైన్ అయింది. కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే, సుదూర ప్రాంతంలో ఉన్న తెలంగాణ నుంచి ఇంతటి క్రమశిక్షణతో కూడిన భారీ సైన్యాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి కమలనాథులకు సవాల్ విసరడం రేవంత్ రెడ్డి పట్టుకు, నిర్వహణా సామర్థ్యానికి నిదర్శనంగా మారింది. ఇప్పటికే ఏఐసీసీ నిధుల సమీకరణ , దక్షిణాది బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆయనకు ఈ ఈవెంట్ హైకమాండ్ వద్ద మరింత ప్రాధాన్యతను, మార్కులను తెచ్చిపెట్టింది.
ఢిల్లీలో రేవంత్ కు మరింత పలుకుబడి
ఎఐసిసి స్థాయిలో రేవంత్ రెడ్డి పలుకుబడి పెరగడం వల్ల నేరుగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, రాజకీయ స్థిరత్వానికి భారీ ప్రయోజనం కలగనుంది. గతంలో పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి నేటి ముఖ్యమంత్రి పీఠం వరకు పార్టీకి కష్టసమయంలో వెంట నిలిచిన రేవంత్‌పై రాహుల్ గాంధీకి ఉన్న నమ్మకం ఈ ర్యాలీ విజయంతో మరింత రెట్టింపైంది. జాతీయ రాజకీయ నిర్ణయాల్లో రేవంత్‌కు దక్కే ప్రాధాన్యత, రాబోయే రోజుల్లో రేవంత్ రహిత కాంగ్రెస్ రాజకీయాలను ఆశించే ప్రత్యర్థులకు బలమైన రాజకీయ ప్రతిసవాలుగా మారడం ఖాయం. హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డి పట్టు పెరగడం రాష్ట్రంలోని ఆయన వ్యతిరేకులకు, పార్టీ అంతర్గత అసమ్మతి వర్గాలకు మింగుడుపడని పరిణామంగా మారింది.
పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల కేటాయింపు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల బి ఫారాల జారీ వంటి అంశాలలో రేవంత్ రెడ్డిదే తుది మాట అయ్యే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. పార్టీ అధిష్ఠానం వద్ద ఆయనకున్న తిరుగులేని పట్టు వల్ల, రాష్ట్రంలో సొంత పార్టీలోని ప్రత్యర్థులైనా లేదా ప్రతిపక్షాలైనా ఆయనను ముట్టుకోవడం ఇక ఏమాత్రం సులభం కాదని ఈ ఢిల్లీ ర్యాలీ నిరూపించింది. ఢిల్లీ ఓటు చోరీ నిరసన సభ రేవంత్ రెడ్డిని కేవలం తెలంగాణ నాయకుడిగానే కాకుండా, ఇండియా కూటమి వేదికగా జాతీయ స్థాయిలో చెరగని ముద్ర వేసుకునేలా చేసింది. సవాళ్లను అధిగమించి కేడర్‌ను ఢిల్లీ తరలించడం ద్వారా తన రాజకీయ చతురతను నిరూపించుకున్న రేవంత్, రాబోయే రోజుల్లో తెలంగాణ పీఠంపై తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

