AP DSC Notification : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ మరికొద్ది సేపట్లో విడుదల చేయనుంది. ఇప్పటికే 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 13న డీఎస్సీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తి స్థాయి నియామక ప్రక్రియకు అధికారులు సిద్ధమయ్యారు. నవంబర్ 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.

Also Read : AP Municipal Election Results 2026 : గెలిచేదెవరో.. నేడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఓట్ల లెక్కింపు తీరు ఇలా.. తొలి ఫలితం ఎక్కడ.. ఎప్పుడంటే?

ఈ డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, పురపాలక పాఠశాలల్లో 2,111 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ప్రత్యేక ఉపాధ్యాయులకు సంబంధించి 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. సొసైటీల పరిధిలో మరో 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్‌, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ విభాగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. ఇలా అన్ని విభాగాలను కలిపి 2,721 పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు.

పోస్టుల భర్తీకి సంబంధించి రిజర్వేషన్ రోస్టర్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ అంశంపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారులతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. పోస్టుల వారీగా రిజర్వేషన్ల ఖరారు, ఇతర నియామకపరమైన అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఇప్పటికే అక్టోబర్ 13న డీఎస్సీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడటంతో తదుపరి నియామక ప్రక్రియపై స్పష్టత రానుంది. నవంబర్ 10 నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్షల షెడ్యూల్ వంటి అంశాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాల్సి ఉంటుంది.