CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలపై మురసు తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం తుపాను తీరందాటింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని, ఆస్తి నష్టాన్ని కూడా సాధ్యమైనంత వరకు నివారించాలని అధికారులను ఆదేశించారు.
Also Read : Pulivendula Municipality : హైకోర్టులో వైసీపీకి బిగ్ షాక్.. పులివెందుల కౌంటింగ్‌కు లైన్ క్లియర్
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, సబ్స్టేషన్ల పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం ఎక్కడా విద్యుత్ స్తంభాలు పడిపోలేదని, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడలేదని విద్యుత్ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు తమ ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, రెండు చోట్ల చెట్లు కూలిపోగా వెంటనే తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు. రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉందని వివరించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఏడు చోట్ల చెట్లు కూలిపోగా సిబ్బంది వెంటనే వాటిని తొలగించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.
ఒంగోలు జిల్లాలో ఐదు ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు సమాచారం అందగానే అధికారులు చర్యలు చేపట్టారని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని, అయితే ఎక్కడా విద్యుత్ స్తంభాలు లేదా చెట్లు కూలిన ఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. బుడమేరు పరిధిలో పర్యటించామని, ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందనే ముందస్తు జాగ్రత్తతో కొన్ని కుటుంబాలను సురక్షిత శిబిరాలకు తరలించినట్లు వివరించారు.
మురసు తుపాన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు తొలుత టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం రాత్రి నుంచి ప్రతి గంటకూ పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు.

