Onion Price: మనకు ఏ వంట చేయాలన్నా ఉల్లిపాయలు ఉండాల్సిందే. ముఖ్యంగా ఇండియన్స్ ఉల్లిపాయలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి, మన దేశంలో కేజీ ఉల్లిపాయలు రూ.50, రూ.60కి లభిస్తుంటే.. ఇవే ఉల్లి ఇతర దేశాల్లో ఎంతకు అమ్ముతున్నారో తెలుసా?
మన దేశంలో ఉల్లిపాయల ధర కిలో రూ.50 లేదా రూ.60 కి చేరితేనే.. వామ్మో ధరలు మండిపోతున్నాయి అని కంగారు పడిపోతూ ఉంటాం. ధరలు పెరిగినప్పుడు కూరల్లో ఉల్లిపాయ వేయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ, విదేశాల్లో ఉండే భారతీయులకు మన వంటింట్లో అతి సాధారణంగా వాడే ఉల్లిపాయ కొనాలంటే కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ లో నివసిస్తున్న ఓ ఇండియన్ మహిళ అక్కడి సూపర్ మార్కెట్ లో ఉల్లిపాయలు, బియ్యం వంటి నిత్యవసర సరుకుల ధరలను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి, అక్కడి ధరలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు చూద్దాం....
ఫ్రాన్స్‌లో నివసిస్తున్న దియా మెహతా (@diyamehhta) అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో తన గ్రోసరీ షాపింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. స్థానికంగా ఉండే 'ఆచన్' (Auchan) సూపర్ మార్కెట్‌కు వెళ్లిన ఆమె, రోజువారీ వంటకు అవసరమైన ఉల్లిపాయలు, టమోటాలు, బంగాళాదుంపలు వంటి అత్యవసర సరుకులను కొనుగోలు చేశారు. మన దగ్గర చాలా తక్కువ ధరకే దొరికే ఉల్లిపాయలకు అక్కడ ఏకంగా రూ. 273 వెచ్చించాల్సి వచ్చిందని ఆమె చూపించారు. కేవలం ఉల్లిపాయలే కాదు, బియ్యం ధర కూడా రూ. 292 ఉండటం విశేషం.
మన దగ్గర వంద రూపాయల లోపే వచ్చే సాధారణ వంట సరుకులకు ఫ్రాన్స్‌లో జేబులు ఖాళీ అవుతున్నాయి. దియా కొనుగోలు చేసిన ఉల్లిపాయలు, బియ్యం సహా కేవలం 6 రకాల రోజువారీ నిత్యావసర వస్తువులకు కలిపి ఏకంగా రూ. 1,421 బిల్లు అయింది. విదేశాల్లో సంపాదన ఎక్కువగా ఉన్నా, రోజువారీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఆకాశాన్ని తాకుతాయని ఈ లెక్కలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది.
ఏ వస్తువుకు అయినా.. MRP( గరిష్ట ధర) అనేది ఉంటుంది. అయితే, ఫ్రాన్స్ లో మాత్రం అలాంటిది ఏమీ ఉండదట. సూపర్ మార్కెట్ వాళ్లు.. తమకు నచ్చిన ధరలు వేసుకుంటూ ఉంటారట. అక్కడ సూపర్ మార్కెట్ సొంత బ్రాండ్లకు (Store labels), ఇతర పాపులర్ బ్రాండ్లకు మధ్య ధరల్లో భారీ తేడా ఉంటుంది. అందుకే ప్రతి వస్తువు ధరను చూసుకుంటూ ఆచితూచి కొనాల్సి వస్తుందని ఆమె వివరించారు.
ఈ వీడియో చూసిన భారతీయ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర ఉల్లిపాయల ధర కాస్త పెరిగితేనే గగ్గోలు పెడతాం కానీ, విదేశాలతో పోలిస్తే మన దేశంలో కూరగాయలు, నిత్యావసరాలు ఎంతో చౌకగా దొరుకుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు.
