మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు, మొదటగా మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటాము. బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో చాలా మందికి అయోమయంగా ఉంటుంది. దక్షిణ భారతీయుల అభిమాన చిరుతిళ్లైన ఇడ్లీ, దోసెలను అందరూ ఇష్టపడతారు. కానీ బరువు తగ్గాలనుకునేవారు ఈ రెండింటిలో ఏది తినాలో అని ఆలోచించడం సహజం. ఇడ్లీ, దోసె రెండూ బియ్యం, మినపపప్పుతో తయారు చేస్తారు. కానీ వాటిని తయారుచేసే పద్ధతి వేరు. దోసె వేయడానికి నూనె వాడాల్సి ఉంటుంది. మరి, బరువు తగ్గాలనుకునే వారికి ఇడ్లీ మంచిదా లేక దోసె మంచిదా? ఏది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది? తెలుసుకుందాం.

ఇడ్లీ ప్రత్యేకతలు

ఆవిరిపై ఉడికింపు: ఇడ్లీని నూనె లేకుండా ఆవిరిపై ఉడికిస్తారు. అందువల్ల అదనపు కొవ్వు, కేలరీలు చేరవు.

తేలికైన అల్పాహారం: జీర్ణం కావడానికి సులభంగా ఉండి, ఉదయం పూట కడుపుపై భారం పడకుండా సహాయపడుతుంది.

పులియబెట్టే ప్రక్రియ: పిండిని పులియబెట్టడం వల్ల కొన్ని పోషకాలు సులభంగా లభించడానికి, జీర్ణ సౌకర్యానికి తోడ్పడుతుంది.

దోశ ప్రత్యేకతలు

నూనె లేదా నెయ్యి వినియోగం: దోశను పెనంపై కాల్చడానికి సాధారణంగా నూనె లేదా నెయ్యి ఉపయోగిస్తారు. ఇది కేలరీలను పెంచుతుంది.

పదార్థాల వైవిధ్యం: బియ్యం, మినపప్పుకు బదులు రాగులు, జొన్నలు, ఓట్స్ లేదా పెసరట్టు వంటి వాటితో తయారు చేస్తే ఫైబర్, ప్రోటీన్ పెరిగి మంచి ప్రయోజనం ఉంటుంది.

ఏది గెలుస్తుంది?

సాధారణ పరిస్థితుల్లో, తక్కువ కేలరీలు, నూనె లేని వంట పద్ధతి దృష్ట్యా ఇడ్లీని కొంచెం మెరుగైన ఎంపికగా భావిస్తారు. అయితే దోశను కూడా చాలా తక్కువ నూనెతో, నాన్‌స్టిక్ లేదా సీజన్‌డ్ పెనంపై కాల్చుకుని, మితమైన పరిమాణంలో తింటే బరువు తగ్గడంలో పెద్ద అభ్యంతరం ఉండదు.

ఇడ్లీ, దోశతో కలిపి తినే పదార్థలు

ఇడ్లీ లేదా దోశ ఏదైనా సరే, వాటితో పాటు ఏం తింటున్నామనేది చాలా ముఖ్యం. కొబ్బరి చట్నీ, వేరుశనగ చట్నీలను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కేలరీలు పెరుగుతాయి. వాటికి బదులుగా కూరగాయలు, పప్పులతో చేసిన సాంబార్ లేదా పుదీనా, కొత్తిమీర వంటి తేలికపాటి చట్నీలను జత చేయడం వల్ల పోషకాలు పెరిగి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. చివరగా, ఏ అల్పాహారమైనా పరిమితి మించకుండా, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటేనే ఆరోగ్య లక్ష్యాలు నెరవేరుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..