Viral Video: భారతదేశంలోని రైల్వే వ్యవస్ధత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంలేదు. ఇకపోతే రైలు ప్రయాణంలో ప్రయాణికులు రకరకాల పనులు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అయితే కొన్నిసార్లు కొందరి చర్యలు ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు భద్రతాపరమైన ఆందోళనలను కూడా కలిగిస్తుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియరాలేదు.

అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఓ ప్రయాణికుడు కదులుతున్న ఏసీ రైలులో దీపం వెలిగించి పూజలు చేస్తూ, గట్టిగా శంఖం ఊదుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియో బయటకు రావడంతో రైలులో ఇలాంటి పనులకు అనుమతి ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ ప్రయాణికుడు తన సీటు సమీపంలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మతపరమైన విశ్వాసాలు, పూజలు వ్యక్తిగతమైనవే అయినప్పటికీ.. కదులుతున్న రైలులో ఇలా నిప్పు లేదా దీపం వెలిగించడం మాత్రం భద్రతాపరమైన సమస్యలకు దారితీయవచ్చు.

ముఖ్యంగా ఏసీ రైలు బోగీలు మూసి ఉన్న ప్రదేశాలు కావడంతో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా అగ్నిప్రమాదానికి కారణమయ్యే ప్రమాదం ఉంది. మంటలు వ్యాపిస్తే ప్రయాణికుల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. రైల్వేలో అగ్నిప్రమాదాలను నివారించడం, ప్రయాణికుల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం ఫైర్‌ సేఫ్టీ నిబంధనల ప్రధాన ఉద్దేశం. పెట్రోల్‌, కిరోసిన్‌, గ్యాస్‌ సిలిండర్లు వంటి మండే స్వభావం కలిగిన ప్రమాదకర వస్తువులను రైలులో తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. అలాగే అగ్నికి కారణమయ్యే వస్తువులను ఉపయోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు సూచిస్తుంటారు. అయితే రైలులో దీపం వెలిగించడం వంటి ఘటనల్లో ఏ చర్య తీసుకోవాలనేది ఉపయోగించిన వస్తువు స్వభావం, దాని వల్ల ఏర్పడిన ప్రమాదం, అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఆధారంగా మాత్రమే నిర్దిష్ట చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పలేం.

రైలు ప్రయాణ సమయంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించినా, ఇతర ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే చర్యలు కనిపించినా వెంటనే రైలులోని రైల్వే సిబ్బందికి సమాచారం అందించాలి. అంతేకాకుండా భారతీయ రైల్వే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 139కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణికులందరి భద్రత దృష్ట్యా రైలులో అగ్నికి కారణమయ్యే వస్తువులను ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోపై నెటిజన్స్ కాస్త సీరియస్ గానే స్పందిస్తున్నారు.

🚨 INDIAN RAILWAYS IN CONTROVERSY OVER AARTI INSIDE MOVING TRAIN! 🚆🔥

A video of an Ayyappa devotee lighting a diya and performing puja inside an AC train coach has gone viral. https://t.co/TAjzOBtioL

— Viral clips (@Viralkps) November 26, 2026