పెళ్లి రోజున అందంగా, మెరిసిపోయే చర్మంతో కనిపించాలని ప్రతి వధువు కోరుకుంటుంది. ముఖ్యంగా పెళ్లి ఫొటోలు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇతర వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం భారతీయ వధువుల్లో ‘గ్లాస్ స్కిన్’ (Glass Skin) ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. కొరియన్ బ్యూటీ రొటీన్ నుంచి వచ్చిన ఈ ట్రెండ్‌లో చర్మం అద్దంలా మెరిసిపోవడం, మృదువుగా, తేమతో నిండుగా కనిపించడం ప్రధాన లక్ష్యం. ఈ లుక్ కోసం చాలామంది వధువులు రకరకాల సీరమ్‌లు, ఎక్స్‌ఫోలియేటింగ్ యాసిడ్స్, కెమికల్ పీల్స్, లేజర్ ట్రీట్‌మెంట్లు, ప్రత్యేక ఫేషియల్స్ చేయించుకుంటున్నారు. అయితే అందంగా కనిపించాలనే ఆరాటంలో చర్మంపై అతిగా ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ చర్మతత్వాన్ని దృష్టిలో పెట్టుకోకుండా చేసే చికిత్సలు చర్మానికి హాని కలిగించవచ్చని సూచిస్తున్నారు.

అసలు గ్లాస్ స్కిన్ అంటే ఏమిటి?

గ్లాస్ స్కిన్ అంటే అద్దంలా నునుపుగా, తేమతో నిండుగా, కాంతివంతంగా కనిపించే చర్మం. కొరియన్ స్కిన్‌కేర్ పద్ధతుల ద్వారా ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. చర్మానికి తగినంత తేమ అందించడం, మృదువైన ఎక్స్‌ఫోలియేషన్, సరైన స్కిన్‌కేర్ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఈ తరహా లుక్ సాధించవచ్చని భావిస్తారు. సోషల్ మీడియా, సినీ ప్రముఖుల పెళ్లి ఫొటోలు, బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావంతో భారతీయ వధువుల్లోనూ ఈ ట్రెండ్‌పై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక కురి ప్రకారం.. గ్లాస్ స్కిన్ అనేది కేవలం అందానికి సంబంధించిన ఒక ఆకాంక్ష మాత్రమే. ఇది వైద్యపరంగా గుర్తించిన ప్రత్యేకమైన చర్మ రకం కాదు. చర్మం మెరుపు అనేది జన్యుపరమైన లక్షణాలు, తేమ, వెలుతురు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. గ్లాస్ స్కిన్ సాధించాలనే తొందరలో చాలామంది ఒకేసారి అనేక రకాల స్కిన్‌కేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ఎక్స్‌ఫోలియేటింగ్ యాసిడ్స్, రెటినాల్, విటమిన్ సీ వంటి పదార్థాలను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ప్రయోజనాలు ఉంటాయి. కానీ వీటిని అతిగా ఉపయోగించడం లేదా ఒకేసారి అనేక శక్తివంతమైన ఉత్పత్తులను చర్మానికి అప్లై చేయడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు.

దీంతో చర్మంపై ఎర్రదనం, పొడిబారడం, మంట, దురద, పొరలుగా ఊడిపోవడం, సున్నితత్వం పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫరీదాబాద్ ఫోర్టిస్ ఆసుపత్రి డెర్మటాలజీ డైరెక్టర్ డాక్టర్ స్వాతి మోహన్ కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నారు. అతిగా ఎక్స్‌ఫోలియేషన్ చేయడం, తరచూ కెమికల్ పీల్స్ చేయించుకోవడం, రెటినాల్ వంటి పదార్థాలను అధికంగా ఉపయోగించడం వల్ల చర్మానికి సహజంగా ఉండే రక్షణ పొర దెబ్బతింటుందని చెబుతున్నారు. ఈ రక్షణ పొర చర్మంలోని తేమను కాపాడటంతో పాటు బయటి నుంచి వచ్చే హానికరమైన పదార్థాలు, సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తుంది. ఇది దెబ్బతింటే చర్మం మరింత సున్నితంగా మారి ఇన్ఫెక్షన్లు, చికాకులు, ఇతర సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. భారతీయ చర్మతత్వంలో కొందరికి పిగ్మెంటేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చర్మంపై మంట, చికాకు లేదా గాయాలు ఏర్పడినప్పుడు వాటి ప్రభావంతో మెలనిన్ ఉత్పత్తి పెరిగి నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు. దీనినే పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్‌పిగ్మెంటేషన్ (Post-inflammatory Hyperpigmentation) అంటారు. ఇలాంటి మచ్చలు కొన్ని వారాల నుంచి నెలల పాటు కూడా ఉండవచ్చు.

అతిగా కెమికల్ పీల్స్ చేయించుకోవడం, సరైన పర్యవేక్షణ లేకుండా లేజర్ చికిత్సలు తీసుకోవడం వల్ల కాలిన గాయాలు, మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే కెమికల్ పీల్స్ లేదా లేజర్ చికిత్సలు అన్నీ ప్రమాదకరమైనవని కాదు. వ్యక్తిగత చర్మతత్వం, సమస్య తీవ్రత, చికిత్స విధానం, నిపుణుల పర్యవేక్షణ ఆధారంగా వాటి భద్రత నిర్ణయించబడుతుంది.

పెళ్లికి ముందు చర్మ సంరక్షణ ఎలా ఉండాలి?

పెళ్లికి కొద్ది రోజుల ముందు కొత్త కొత్త బ్యూటీ ట్రీట్‌మెంట్లు ప్రయత్నించడం కంటే ముందుగానే చర్మ సంరక్షణపై దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్ ప్రియాంక కురి సూచన ప్రకారం.. పెళ్లికి కనీసం 3 నుంచి 6 నెలల ముందే స్కిన్‌కేర్ రొటీన్ ప్రారంభించాలి. తద్వారా చర్మ సమస్యలను గుర్తించి, అవసరమైన చికిత్స తీసుకునేందుకు తగిన సమయం లభిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించాలి.

  • మృదువైన క్లెన్సర్: చర్మతత్వానికి సరిపోయే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గట్టిగా రుద్దడం, తరచూ స్క్రబ్ చేయడం మానుకోవాలి.
  • మాయిశ్చరైజర్: చర్మంలో తేమను నిలిపి ఉంచేందుకు తగిన మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ఇది చర్మ రక్షణ పొరను కాపాడుతుంది.
  • సన్‌స్క్రీన్: ప్రతిరోజూ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తగ్గించి పిగ్మెంటేషన్ సమస్యలు పెరగకుండా సహాయపడుతుంది.
  • వ్యక్తిగత చర్మ చికిత్స: మొటిమలు, నల్లటి మచ్చలు, సున్నితమైన చర్మం వంటి సమస్యలు ఉంటే డెర్మటాలజిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే ప్రత్యేక ఉత్పత్తులు, చికిత్సలు ప్రారంభించాలి.

ముఖ్యంగా పెళ్లికి కొద్ది రోజుల ముందు కొత్త స్కిన్‌కేర్ ఉత్పత్తులు ఉపయోగించడం లేదా తీవ్రమైన చికిత్సలు చేయించుకోవడం మంచిది కాదని డాక్టర్ స్వాతి మోహన్ సూచిస్తున్నారు. ఎందుకంటే చికిత్స తర్వాత చర్మం కోలుకోవడానికి కొంత సమయం అవసరం. కొన్నిసార్లు సాధారణంగా సురక్షితమైన చికిత్సలు కూడా అనుకోని ప్రతిచర్యలకు కారణమవుతాయి. గ్లాస్ స్కిన్ ట్రెండ్‌లో ఉన్న మరో అపోహ ఏమిటంటే.. చర్మంపై రంధ్రాలు కనిపించకూడదని, ఎలాంటి మచ్చలు, గీతలు ఉండకూడదని భావించడం. కానీ నిజానికి చర్మంపై రంధ్రాలు, సహజమైన ఆకృతి ఉండటం పూర్తిగా సాధారణం. వయస్సు, జన్యువులు, చర్మంలో నూనె ఉత్పత్తి వంటి అంశాల ఆధారంగా ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. రంధ్రాలు కనిపిస్తున్నాయని చర్మం అనారోగ్యంగా ఉందని అర్థం కాదు. చర్మం తేమగా ఉండటం, ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆరోగ్యంగా పనిచేయడం ముఖ్యమని డాక్టర్ ప్రియాంక కురి స్పష్టం చేస్తున్నారు. చర్మాన్ని అద్దంలా మార్చుకోవడం కంటే దాని సహజ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అసలైన లక్ష్యమని నిపుణులు సూచిస్తున్నారు. పెళ్లి రోజున అందంగా కనిపించాలనే కోరిక సహజమే. అయితే అందుకోసం చర్మంపై అతిగా ప్రయోగాలు చేయడం, ఒకేసారి అనేక బ్యూటీ ట్రీట్‌మెంట్లు తీసుకోవడం మంచిది కాదు. సరైన ఆహారం, తగినంత నీరు, నిద్ర, క్రమబద్ధమైన స్కిన్‌కేర్, సన్‌స్క్రీన్ వినియోగం, అవసరమైనప్పుడు డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. పెళ్లి రోజున అందంగా కనిపించాలంటే అద్దంలా మెరిసే చర్మం ఉండాల్సిన అవసరం లేదు. సహజమైన అందంతో, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించడమే నిజమైన అందం!