Tilak Varma React on India A’s Defeat vs Sri Lanka A: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఏ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. గురువారం దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్‌లో శ్రీలంక-ఏ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేయగా.. శ్రీలంక 41.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లంక విజయంలో సినెత్ జయవర్ధనే (70 బంతుల్లో 105 పరుగులు) కీలక పాత్ర పోషించాడు. సెంచరీ బాదిన జయవర్ధనేకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం భారత్-ఏ కెప్టెన్ తిలక్ వర్మ జట్టు ప్రదర్శనపై స్పందించాడు. బ్యాటర్లు బాగా ఆడారని, బౌలర్లు తేలిపోవడంతోనే ఓటమి ఎదురైందని చెప్పాడు.

‘మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 320 నుంచి 330 పరుగులు మంచి స్కోరు అవుతుందని భావించాము. తొలి 20 ఓవర్లలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత మాత్రం కొంత నెమ్మదించింది. కొన్ని బంతులు పిచ్‌పై పడి ఆగడంతో పాటు తక్కువ ఎత్తులో వచ్చాయి. ఈ క్రమంలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడినప్పటికీ.. తానుజ్, షహబాజ్ అద్భుతంగా ఆడి జట్టును 317 పరుగుల స్కోరుకు చేర్చారు. 318 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో తొలి 15 ఓవర్లు చాలా కీలకమని బౌలర్లకు చెప్పా. ప్రత్యర్థిని ఓవర్‌కు ఆరు పరుగుల లోపే పరిమితం చేయగలిగితే తమకు విజయావకాశాలు ఉంటాయని భావించాము. పిచ్ మరింత నెమ్మదిస్తుందని అంచనా వేశాం. అయితే మా ప్రణాళికలను మైదానంలో సమర్థంగా అమలు చేయలేకపోము’ అని తిలక్ వర్మ అంగీకరించాడు.

‘శ్రీలంక ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా తొలి వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది. బౌలింగ్‌లో అందరికీ అవకాశాలు ఇచ్చి చూశా. కానీ ఆరోజు మాకు ఏదీ కలిసి రాలేదు. ఒక్కోసారి ఇలాంటి చెడు రోజులు ఎదురవుతాయి. శ్రీలంక బ్యాటర్ల ప్రదర్శనకు పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సిందే. టోర్నీలో భారత్-ఏకు కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. తొలిసారి ఆడుతున్న యువ ఆటగాళ్లు తానుజ్, షహబాజ్ మంచి ప్రతిభ కనబరిచారు. షహబాజ్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలగడం జట్టుకు ఉపయోగకరం. తానుజ్ కూడా ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. బ్యాటింగ్ విభాగం మొత్తంగా బాగా రాణించింది. అయితే బౌలింగ్‌లో ఎక్కడ లోపాలు జరిగాయో డ్రెస్సింగ్ రూమ్‌లో సమీక్షించుకుని.. వాటిని సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తాము’ అని తిలక్ స్పష్టం చేశాడు. లంక ఓపెనర్లు లసిత్‌ క్రాస్‌పుల్‌ (116), సినెత్‌ జయవర్దన (105) సెంచరీలతో చెలరేగారు.