APSRTC : ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టీసీ డ్రైవర్లకు భారీ ఊరట లభించినట్లయింది. విధి నిర్వహణలో భాగంగా ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కు గురైన డ్రైవర్లకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీతాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read : AP Rain Alert : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. అలర్ట్ జారీ..

ఆర్టీసీ డ్రైవర్లు విధి నిర్వహణలో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగితే కేసులు నమోదవుతుంటాయి. అయితే, ఆ ప్రమాదాల్లో మరణాలు సంభవించిన సమయంలో వారి లైసెన్సులను మోటారు వాహన చట్టం ప్రకారం సస్పెండ్ చేస్తారు. అనంతరం ఆర్టీసీ శాఖాపరమైన విచారణ జరుపుతుంది. ఈప్రమాదం సమయంలో డ్రైవర్ల తప్పులేదని తేలితే అప్పుడు ప్రత్యామ్నాయ విధులు కేటాయిస్తారు. డ్రైవింగ్ లైసెన్సులను పునరుద్దరించే వరకు వీరు ప్రత్యామ్నాయ విధుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఆర్టీసీ డ్రైవర్లు సస్పెన్షన్‌లో ఉండటంతో ఆ డ్రైవర్లు విధులు నిర్వర్తించే అవకాశం లేకుండా పోతోంది.. సస్పెన్షన్ సమయంలో జీతం కూడా పొందలేకపోతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రమాదాల సమయంలో తమ ప్రమేయం లేకపోయినా లైసెన్సులు రద్దు కావడంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్నామని కొంతకాలంగా డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను ఉద్యోగ సంఘాల నేతల ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వీరి అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం.. ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కు గురైన డ్రైవర్లకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీతాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రమాద ఘటనల్లో డ్రైవర్ల తప్పిదం లేదని ప్రాథమిక విచారణలో తేలితే, వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

అంతేకాక.. సస్పెన్షన్ కారణంగా విధులకు దూరమైన డ్రైవర్లకు, వారి లైసెన్స్ తిరిగి పునరుద్దరణ జరిగే వరకు డిపోలలోనే ఇతర ప్రత్యామ్నాయ విధులు కేటాయించాలని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ తాత్కాలిక నియామకం ద్వారా వారికి వేతన నష్టం కలగకుండా చూడటంతో పాటు సంస్థ సేవలను కూడా వినియోగించుకున్నట్లవుతోందని భావించింది. అలాగే నిరపరాధులని తేలిన డ్రైవర్ల లైసెన్సులను పునరుద్ధరించాలని ఆర్టీవో అధికారులకు లేఖలు రాయాలని డిపో మేనేజర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఒకవేళ డ్రైవర్ లైసెన్స్ మూడు నెలలకు మించి సస్పెన్షన్ కొనసాగితే అలాంటి వారు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జోనల్ అధికారుల నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్లకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించడం ద్వారా వారికి వేతనం కూడా వస్తుంది. అలాగే వారి సేవలను కూడా వినియోగించుకున్నట్లు ఉంటుందని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ డ్రైవర్లు, ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.